రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన్రు : దాసోజు

రాజ్యాంగాన్ని ఖూనీ చేసిన్రు : దాసోజు
  •  జూబ్లీహిల్స్ ఎన్నికలో అక్రమాలు జరిగినయ్: దాసోజు

హైదరాబాద్, వెలుగు: ఉత్తరప్రదేశ్, బిహార్ ఎన్నికలను తలపించేలా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలు జరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇంత దారుణంగా ఎప్పుడూ ఎన్నికలు జరగలేదన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేసి ఎన్నికలు నిర్వహించారని విమర్శించారు. తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. “ప్రజలపై రేవంత్ రెడ్డికి విశ్వాసం పోయింది. అందుకే అంతులేని అక్రమాలకు తెరలేపారు. ఎన్నికల కమిషన్ గుడ్డి గుర్రం పండ్లు తోమినట్టు వ్యవహరించింది. 20 ఫిర్యాదులు ఇచ్చినా స్పందన లేదు. బోగస్ ఓటింగ్ ఇంతలా ఎప్పుడూ జరగలేదు. సబ్బండవర్గాలు కేసీఆర్ కు ఓటేస్తామని చెప్పాయి. 

బీఆర్ఎస్ గెలుస్తుందని తెలిసే రేవంత్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. పాతబస్తీ నుంచి ఓటర్లను తెప్పించి ఓట్లు వేయించారు. ఎంఐఎం ఇందుకు సహకరించింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గర ఉండి దొంగ ఓట్లు వేయించారు’’అని దాసోజు ఆరోపించారు. 13 ఏండ్ల అమ్మాయితో కూడా కాంగ్రెస్ నేతలు ఓటు వేయించారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. సీ విజిల్ యాప్ పని చేయలేదని, ఇంత కన్నా ఘోరం ఉంటుందా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లకు పోలీసులు సహకరించారని మండిపడ్డారు.