
- కేంద్రాన్ని డిమాండ్ చేసిన కేటీఆర్
- జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నేపథ్యంలో లేఖ
హైదరాబాద్, వెలుగు: చేనేత వస్త్రాలపై 5% జీఎస్టీని ఎత్తివేయాలని.. పెట్రోల్, డీజిల్‌పై కూడా ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌లను రద్దు చేయాలని కేంద్రాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రానికి ఆయన మంగళవారం బహిరంగ లేఖ రాశారు. చేనేత సాంస్కృతిక వారసత్వమని, దానిపై జీఎస్టీని రద్దు చేయాలన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా ఇండియాలోనే రికార్డు స్థాయిలో ఉన్నాయని ఆరోపించారు.
దీనికి కేంద్రం విధించిన ఎక్సైజ్ డ్యూటీ, సెస్‌లే కారణమన్నారు. "ముడి చమురు ధరలు పడిపోయినా దేశంలో పెట్రో ధరలను తగ్గించడం లేదు. ఈ భారం తగ్గించకుండా జీఎస్టీలో నామమాత్ర మార్పులతో ప్రజలకు ఉపశమనం లభించదు. 12% జీఎస్టీ శ్లాబ్ రద్దు జుమ్లా మాత్రమే. ఇది మొత్తం జీఎస్టీ పరిధిలోని 22 లక్షలకోట్లకు పైగా వచ్చే ఆదాయంలో కేవలం 5శాతమే. అందులోని వస్తువులను వేరే శ్లాబుల్లోకి మార్చి దేశ ప్రజలందరినీ ఉద్ధరించినట్లు మోదీ ప్రభుత్వం చెప్పుకోవడం హాస్యాస్పదం.
దశాబ్దంగా పాలు, పెరుగు, పప్పు, ఉప్పు వంటి నిత్యావసరాలపై జీఎస్టీ విధించి సామాన్యుల నడ్డి విరిచింది బీజేపీ సర్కారే. జీవిత బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, చదువుల ఫీజులు, క్యాన్సర్ మందులపై కూడా జీఎస్టీ రద్దు చేయాలి" అని కేటీఆర్ తన లెటర్ ద్వారా కేంద్రాన్ని కోరారు.