పురుషులందు పుణ్య పురుషులు వేరయా అనే సామెత.. ఇతగాడికి సరిగ్గా సరిపోతుంది. మగ జాతిలో ఆణిముత్యం అంటూ ఇప్పుడు సోషల్ మీడియా కీర్తిస్తుంది. ఇంతకీ ఈ మగాడు చేసిన పని ఏంటో తెలుసా.. పెళ్లి వేడుకలో అమ్మాయి తరపు వారు కట్నం కింద 51 లక్షల రూపాయలు ఇచ్చారు.. ఆ డబ్బు కట్టలను.. అందరి ముందు తిరిగి ఇచ్చేశాడు.. కేవలం ఒకే ఒక్క వెండి నాణెం తీసుకున్నాడు.. అంతేనా.. మీ కట్నం డబ్బులు మీరే తీసుకోండి.. మీ అమ్మాయిని ఇస్తే చాలు అంటూ సగర్వంగా ప్రకటించి.. మగజాతిలో ఆణిముత్యంగా అందరితో శెభాష్ అనిపించుకుంటన్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కథనం పూర్తి వివరాలు తెలుసుకుందామా..
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన ఒక పెళ్లి వేడుకలో వరుడు తన గొప్ప మనసు చాటుకున్నాడు. పెళ్ళికి ముందు నిశ్చితార్థం లాంటి వేడుకలో వధువు కుటుంబం ఇచ్చిన 51 లక్షల నగదు పళ్ళెంను వరుడు వొద్దన్నాడు. వధువు తరఫు వారు ఎంత బతిమాలినా, అతను ఒప్పుకోలేదు. చివరికి ఒక వెండి నాణెం మాత్రమే తీసుకుని సాదాసీదాగా పెళ్లి చేసుకున్నాడు.
డిసెంబర్ 11న పైగంపూర్ నివాసి అయిన వివేక్ పెళ్లి, మధురకు చెందిన వ్యాపారవేత్త వేద్‌పాల్ ఫౌజ్‌దార్ కుమార్తె కృష్ణతో మీరట్ రోడ్డులోని ఒక కల్యాణ మండపంలో జరిగింది. పెళ్ళికి ముందు రాత్రి 10 గంటల సమయంలో పెళ్లి ఆచారాలు జరుగుతున్నప్పుడు వధువు తండ్రి 51 లక్షల నగదుతో అలంకరించిన పళ్ళెంను వరుడి ముందు ఉంచారు.
వరుడు వివేక్, ఆ డబ్బు పళ్ళెంను తాకి వెంటనే తిరిగి ఇచ్చేశాడు. మాకు మీ కూతురు మాత్రమే కావాలి, కట్నంగా ఒక్క రూపాయి కూడా వద్దు అని చెప్పాడు. ఇది మా ఆచారం, మా అమ్మాయిని ఖాళీ చేతులతో పంపలేము అని వధువు కుటుంబం పదేపదే చెప్పడంతో వివేక్ ఒక వెండి నాణెంను మాత్రమే ఆచారంగా తీసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లి పనులు జరిగాయి.
వరుడు వివేక్ తండ్రి జైపాల్ సింగ్ ఒక పేరున్న వ్యాపారవేత్త. వరుడి బంధువు ఒకరు భారతీయ కిసాన్ యూనియన్ (BKU) టికైత్ యువజన విభాగంలో NCR అధ్యక్షుడిగా ఉన్నారు.
ఈ సంఘటన వీడియోలు బయటకు రాగానే, సోషల్ మీడియాలో వివేక్‌ను తెగ పొగిడారు. కొందరు వివేక్ కుటుంబం ఒక గొప్ప ఉదాహరణ అని కామెంట్ చేయగా.. కొందరు వరకట్నం లేని పెళ్లిళ్లు చేస్తే ఈ రోజుల్లో పెళ్లిపై యువతకు తగ్గుతున్న నమ్మకం తిరిగి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

