గృహ హింస కేసులో యువకుడి ఆత్మహత్య.. కరీంనగర్ మహిళా సీఐపై కేసు నమోదు

గృహ హింస కేసులో యువకుడి ఆత్మహత్య.. కరీంనగర్ మహిళా సీఐపై కేసు నమోదు

గృహ హింస కేసును పర్యవేక్షిస్తున్న మహిళా సీఐకి ఊహించని షాక్ తగిలింది. భార్యాభర్తల మధ్య వచ్చిన గొడవలతో భార్య గృహ హింస కేసు పెట్టడంతో.. ఆ కేసును పర్యవేక్షిస్తున్న సీఐ.. యువకుడి మృతికి కారణమైందనే ఆరోపణలతో ఆమెపై కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. కరీంనగర్ మహిళా పోలీస్టేషన్ సీఐ శ్రీలతపై కేసు నమోదు కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. తమ కొడుకు మృతికి కారణం సీఐ శ్రీలతతో పాటు అత్తింటి వారి వేధింపులే కారణమని మృతుడి తండ్రి కడారి లింగయ్య చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. గృహ హింస కేసులో బయటకు రాకుండా చేస్తానని పలు మార్లు సీఐ శ్రీలత బెదిరించారని.. భయంతో తనకొడుకు కడారి శ్రావణ్ కుమార్ చనిపోయాడని   ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐతో పాటు మృతుడి భార్య బంధువులపై చొప్పదండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 

చొప్పదండికి చెందిన కడారి శ్రావణ్ కుమార్ (34) కు కరీంనగర్ కు చెందిన బత్తుల నీలిమతో 2021 లో వివాహం అయ్యింది. వీరికి నాలుగేండ్ల పాప కూడా ఉంది. భార్యాభర్తల మధ్య గొడవ జరిగి 2024లో నీలిమ తన తల్లిగారి ఇంటికి వెళ్లి ఉంటోంది. కుటుంబ కలహాలు ముదిరి శ్రావణ్ పై నీలిమ కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో గృహహింస, వరకట్న వేధింపుల కేసు నమోదు చేసిందని మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

అయితే ఈ కేసులో మహిళా స్టేషన్ సీఐ శ్రీలత పలుమార్లు తన కొడుకును బెదిరించిందనీ.. ఈ కేసులో బెయిల్ కోసం రావాల్సిందిగా స్టేషన్ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పాడు. స్టేషన్ కు వెళితే కొడతారనే భయంతో తన కుమారుడు పురుగుల మందు తాగి చనిపోయినట్లు మృతుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై చొప్పదండి స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో కోడలు నీలిమతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదైంది.