సీబీఎస్‌ఈ (CBSE) 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో దొర్లిన తప్పులు, డిజిటల్ విధానంపై తలెత్తుతున్న అనుమానాలకు సంబంధించిన ఈ వివాదం కేవలం ఇద్దరు విద్యార్థుల మార్కుల సమస్యతోనే మొదలైంది. కానీ కొద్ది రోజుల్లోనే ఇది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫలితాల తర్వాత పాటించే పద్ధతులు, జవాబు పత్రాలను విద్యార్థులకు చూపించే విధానం, కొత్తగా తెచ్చిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) డిజిటల్ విధానం నమ్మకంపై పెద్ద ఎత్తున ఆందోళనలకు దారితీసింది.
12వ తరగతి విద్యార్థులైన వేదాంత్, సంజన వారి పేపర్లు రీ-వెరిఫికేషన్ చేసుకున్నప్పుడు సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన జవాబు పత్రాల స్కాన్ కాపీలు వాళ్ళవి కావని, వాటిలోని చేతిరాత కూడా వాళ్ళది కాదని ఆరోపించారు. ఈ సంఘటనలు కేవలం పొరపాటున జరిగినవా లేక డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలోనే ఏవైనా పెద్ద లోపాలు ఉన్నాయా అనే చర్చకు తెరలేపాయి.
ఈ సమస్య కేవలం ఇద్దరు విద్యార్థులకే కాదు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రాశారు. వీరిలో సైన్స్ స్ట్రీమ్ విద్యార్థులు చాలా చాల మంది ఉన్నారు. కనీస అంచనా ప్రకారం.. దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ పరీక్షలు రాసి ఉంటారు.
అందుకే ఈ వివాదం సీబీఎస్‌ఈకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) ప్రక్రియలో ఒక్క ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ పేపర్ తప్పుగా స్కాన్ అయినా, బార్‌కోడ్ తప్పుగా పడినా, లేదా ఒకరి పేపర్ మరొకరికి అప్‌లోడ్ అయినా.. లక్షల పేపర్లను నిర్వహించే ఈ డిజిటల్ వ్యవస్థపైనే నమ్మకం పోతుంది. ఇది కేవలం ఒక గుమస్తా చేసిన చిన్న తప్పు కాదని, పేపర్లు స్కాన్ చేయడం, బార్‌కోడ్ వేయడం, కంప్యూటర్‌లో భద్రపరచడం వరకు ప్రతి దశలోనూ రక్షణ చర్యలు కరువయ్యాయని నిపుణులు విమర్శిస్తున్నారు.
అసలు వివాదం ఏంటి
మే 13న సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పారదర్శకత కోసం సీబీఎస్‌ఈ ఒక కొత్త నిబంధన తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థులు వాళ్ళ మార్కులపై రీవాల్యుయెషన్ దరఖాస్తు చేసుకునే ముందు, జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పించారు.
అయితే, ఈ ప్రక్రియ మొదలైనప్పటి నుండి పోర్టల్ క్రాష్ అవ్వడం, డబ్బులు కట్ అయినా దరఖాస్తు కాకపోవడం, పేపర్లు రావడం ఆలస్యం కావడం, స్కాన్ చేసిన కాపీలు సరిగ్గా కనిపించకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. వాటన్నిటికంటే మించి, వాళ్లకు వచ్చిన జవాబు పత్రాలు అసలు వాళ్ళవి కావనే ఆరోపణలు రావడం సంచలనం సృష్టించింది.
ఆ ఫిజిక్స్ పేపర్ నాది కాదు..
12వ తరగతి విద్యార్థి వేదాంత్, సీబీఎస్‌ఈ తనకు పంపిన ఫిజిక్స్ జవాబు పత్రం తనది కాదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్కాన్ కాపీలో ఉన్న చేతిరాత, సమాధానాలు తన రాతకు పూర్తిగా వేరేల ఉన్నాయని అతను వాదించాడు. అసలు తన పేపర్‌ను అసలు దిద్దారో లేదోనని అనుమానం వ్యక్తం చేశాడు. మొదట్లో ఇది ఏదో పొరపాటు అనుకున్నా, వేదాంత్ రాసిన ఇతర సబ్జెక్టుల పేపర్లతో పోల్చి చూశాక అతని కుటుంబ సభ్యులు కూడా సీబీఎస్‌ఈపై ఫిర్యాదు చేశారు.
సీబీఎస్‌ఈ స్పందన
వేదాంత్ ఫిర్యాదుపై సీబీఎస్‌ఈ స్పందిస్తూ.. అతని సమస్యను పరిశీలించామని, అతనికి సరైన ఫిజిక్స్ జవాబు పత్రాన్ని పంపామని స్పష్టం చేసింది. అతని మార్కులను కూడా అప్‌డేట్ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. బోర్డు తీసుకున్న ఈ చర్యల ద్వారా జవాబు పత్రాల నిర్వహణలో లేదా ఆన్‌లైన్ మ్యాపింగ్‌లో లోపం జరిగిందని స్పష్టమవుతోంది.
మొదటి పేజీ మాత్రమే నాది, లోపల రాత వేరేవాళ్లది
వేదాంత్ ఉదంతం బయటకు వచ్చిన కొద్దిసేపటికే సంజన అనే విద్యార్థిని కూడా తన కెమిస్ట్రీ పేపర్ విషయంలో ఇలాంటి ఫిర్యాదే చేసింది. కెమిస్ట్రీలో అనుకున్నదానికంటే తక్కువ మార్కులు రావడంతో ఆమె స్కాన్ కాపీ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే, ఆ కాపీ చూసి ఆమె షాక్‌కు గురైంది. జవాబు పత్రంపై తన వివరాలు ఉన్న మొదటి పేజీ తనదేనని, కానీ లోపల ఉన్న పేజీలలోని చేతిరాత, సమాధానాలు మాత్రం నావి కావని, అవి వేరే ఎవరివోనని ఆమె ఆరోపించింది. తప్పు పేపర్ అప్‌లోడ్ కావడం వల్లే తాను రీవాల్యుయెషన్ కూడా దరఖాస్తు చేసుకోలేకపోయానని చెప్పింది. సంజన కుటుంబం కూడా అసలు పేపర్ చూపించాలని సీబీఎస్‌ఈని ఆశ్రయించింది. కానీ, వేదాంత్ కేసులాగా సంజన విషయంలో సీబీఎస్‌ఈ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
వేదాంత్, సంజనలకు మొదట అప్‌లోడ్ చేసిన జవాబు పత్రాలు ఎవరివి ? ఆ విద్యార్థులు ఎవరు ? స్కాన్ చేయడం, బార్‌కోడ్ ట్యాగ్ చేయడం లేదా కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసేటప్పుడు ఈ తప్పు ఎక్కడ జరిగిందో సీబీఎస్‌ఈ స్పష్టత ఇవ్వలేదు.
