జన గణనకు సన్నాహాలు.. 2011 ప్రకారం ఉమ్మడి నల్గొండలో ఇండ్లు 8,75,939, జనాభా 34,88,809

జన గణనకు సన్నాహాలు..  2011 ప్రకారం ఉమ్మడి నల్గొండలో ఇండ్లు 8,75,939,  జనాభా 34,88,809
  • రెండు నుంచి రెండున్నర శాతంజనాభా పెరిగే అవకాశం
  • ఏప్రిల్​ నుంచి హౌస్​ లిస్టింగ్​
  • ప్రిన్సి​పల్​ సెన్సెస్​ ఆఫీసర్​గా కలెక్టర్​
  • 700 నుంచి 800 మంది ఎన్యూమరేటర్లు​

యాదాద్రి, వెలుగు: జనాభా లెక్కల కోసం జిల్లాల్లో అంతా రెడీ అవుతోంది. ముందుగా ఇండ్ల సంఖ్య నమోదు చేసిన తర్వాత జనాభాను లెక్కించనున్నారు. కలెక్టర్ల నేతృత్వంలో దీనికి సంబంధించి సన్నాహాలు చేస్తున్నారు. అయితే జనగణనతో పాటు కులగణనకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు లేవని ఆఫీసర్లు చెబుతున్నారు 

2011లో 16వ జనగణన

దేశవ్యాప్తంగా 2011లో16వ జనగణన జరిగింది. ఆ తర్వాత 2021లో జరగాల్సి ఉన్నా..  కరోనా కారణంగా జరగలేదు. ఇప్పుడు తాజాగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2011లో నిర్వహించిన లెక్కల ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 8,75,939 ఇండ్లు ఉన్నాయి.  34,88,809 జనాభా కలిగి ఉంది. ఇందులో చిన్నారుల సంఖ్య 3,71,735 కాగా.. ఎస్సీలు 6,37,385 ఉండగా ఎస్టీలు 3,94,279 మంది ఉన్నారు. చదువుకున్న వారు 20.01 లక్షల మంది ఉండగా చదువురాని వారు 17.41 లక్షల మంది ఉన్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల్లో 17.41 లక్షల మంది ఉండగా నాన్​ వర్కింగ్​లో 17.47 లక్షల మంది ఉన్నారు. 

ఏప్రిల్ నుంచి ఇండ్ల గణన

జనగణనలో భాగంగా ఏప్రిల్​నుంచి ఇండ్లను లెక్కించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్​ వరకూ జరిగే ఈ గణనలో ప్రతీ ఇంటిని ఎన్యూమరేటర్​ సందర్శిస్తారు. ముందుగా ఇంటి స్వరూపం గురించి వివరాలు నమోదు చేసుకుంటారు. గుడిసె, పెంకులు, స్లాబ్ గదుల సంఖ్య, జీ ప్లస్ వన్, అంతకు పైగా వంటి వివరాలను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత ఇంటి యజమాని పేరు, కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్​2026 వరకూ కొనసాగుతుంది. 

800 మందికి ఎన్యూమరేటర్​

ఇండ్ల సంఖ్య, యజమానులు, కుటుంబ సభ్యుల సంఖ్య తేలిన తర్వాత జనాభాపై కొంత క్లారిటీ వస్తుంది. దీంతో ప్రతి 700 నుంచి 800 మందికి ఒక్క ఎన్యూమరేటర్‌‌ను నియమిస్తారు. ఆరుగురు ఎన్యూమరేటర్‌‌కు ఒక సూపర్​వైజర్​ను నియమిస్తారు. వీరందరూ తమ సొంత మొబైల్​లోనే  సీఎంఎంఎస్​(సెన్సెస్​ మేనేజ్​మెంట్​ అండ్​మానిటరింగ్ సిస్టమ్​) వెబ్​పోర్టల్​ను డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. జనగణనపై ట్రైనింగ్​ ఇవ్వడానికి మాస్టర్​ ట్రైనర్​, పీల్డ్​ట్రైనింగ్​ కోసం పలువురిని ఇప్పటికే సెలక్ట్​ చేశారు. 

ప్రిన్సి​పల్​ సెన్సెస్​ ఆఫీసర్​గా కలెక్టర్​

జనగణనకు ప్రిన్సిపల్​సెన్సెస్​ఆఫీసర్​గా కలెక్టర్​వ్యవహరిస్తారు. అడిషనల్​ కలెక్టర్లు అడిషనల్​ ప్రిన్సిపల్​ సెన్సెస్​ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. డివిజన్లకు ఆర్డీవోలు, సీపీవో, డీఈవో, డీఏవో, జెడ్పీ సీఈవో, డీపీవో, డీపీఆర్​వో,  ఏడీసీవోలు ఉంటారు. అదే విధంగా మండలాల్లో చార్జ్​ఆఫీసర్లుగా తహసీల్దార్లు, అడిషనల్​ చార్జ్​ ఆఫీసర్లుగా ఎంపీడీవోలు, ఎంఈవోలు వ్యవహరిస్తారు. మున్సిపాలిటీల్లో చార్జ్​ఆఫీసర్లుగా మున్సిపల్​ కమిషనర్లు, అడిషనల్​చార్జ్​ఆఫీసర్లుగా మేనేజర్లు వ్యవహరిస్తారు. 

జనాభా పెరిగే చాన్స్

2011లో నిర్వహించిన జనగణనలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 34,88,809 జనాభా కలిగి ఉంది.  అప్పటి జనాభాకు రెండు నుంచి రెండున్నర శాతం జనాభా పెరిగే అవకాశాలు ఉంటాయని ఆఫీసర్లు చెబుతున్నారు. పట్టణాల వైపునకు ఎక్కువగా జనం వెళ్లడం, కుటుంబ నియంత్రణ, ఒంటరిగా జీవితంపై ఇష్టంగా ఉండడం వంటి కారణాల వల్ల జనాభా పెరుగుదలపై ప్రభావం పడుతోందని అభిప్రాయపడుతున్నారు ఈ కారణాల వల్ల గత జనాభాకు రెండు శాతమే పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

ఫిబ్రవరి 2027 నుంచి జనగణన

ఫిబ్రవరి 2027 నుంచి జనగణన ప్రారంభవుతుంది. గతంలో పేపర్​పై జరిగే ఈ గణన ఇప్పుడు సీఎంఎంఎస్​(సెన్సెస్​ మేనేజ్​మెంట్​అండ్​మానిటరింగ్​సిస్టమ్​) 2027 వెబ్​పోర్టల్​లో ఎన్యూమేటర్​ నమోదు చేస్తారు. జనగణనతో పాటు కుల గణన చేస్తారని గతంలో ప్రచారం జరిగినా.. ఇప్పటివరకూ అలాంటి ఆదేశాలు ఏమీ లేవని ఆఫీసర్లు చెబుతున్నారు. వాస్తవంగా కులగణన బ్రిటీష్​ హయాంలో 1881 నుంచి 1931 వరకూ జరిగింది. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కులగణన నిర్వహించినా.. వివరాలు వెల్లడించలేదు. 2027 జనగణనతో కుల గుణన అంశంపై క్లారిటీ లేదు. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2011 జనాభా లెక్కలు..

జిల్లా    పురుషులు    మహిళలు    మొత్తం

నల్గొండ    8,18,306    8,00,110    16,18,416

సూర్యాపేట    5,50,974    5,48,586    10,99,560

యాదాద్రి    3,90,492    3,80,341    7,70,833