పీఎం ఆవాస్ స్కీంలో సాయం తక్కువ.. రూల్స్ ఎక్కువ

పీఎం ఆవాస్ స్కీంలో సాయం తక్కువ.. రూల్స్ ఎక్కువ
  • రాష్ట్రం సర్వే చేసినా తమ యాప్‌‌లో సర్వే చేయాల్సిందేనన్న కేంద్రం
  • 15 శాతం మాత్రమే సర్వే పూర్తి
  • రూరల్‌‌లో ఒక్క ఇల్లు కూడా సాంక్షన్ చేయని కేంద్రం
  • కేంద్రం సాయం చేయకున్నా ఇండ్లు నిర్మిస్తామన్న మంత్రి పొంగులేటి

హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతాల్లో  పీఎం ఆవాస్ యోజన కింద ఇండ్లు ఇచ్చేందుకు జరుగుతున్న సర్వే నిదానంగా సాగుతోంది. రూరల్ ప్రాంతాల్లో ఇళ్లు మంజూరు చేయాలంటే తమ యాప్‌‌లో సర్వే చేయాలని కేంద్రం స్పష్టం చేయటంతో అధికారులు మళ్లీ సర్వే చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ర్ట వ్యాప్తంగా ఇండ్లు లేని పేదల వివరాలను సర్వే చేసి హౌసింగ్ శాఖ రిపోర్ట్ రెడీ చేసింది. ఇందులో అసలు ఇండ్లే లేనివాళ్లు, ఇండ్లు ఉండి శిథిలావస్ధకు చేరుకున్నవాళ్లు, ఇండ్లు నిర్మించుకునేందుకు సొంత జాగా ఉన్నవాళ్లు.. ఇలా ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3 అని మూడు కేటగిరీలుగా డివైడ్ చేసింది. 

ఈ సర్వే రిపోర్ట్ ను కేంద్రానికి పంపగా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా.. తమ యాప్ ప్రకారం మళ్లీ సర్వే చేయాలని చెప్పటంతో రెండో సారి సర్వే చేస్తున్నారు. ఎల్ 1 కేటగిరీలో సొంత జాగా ఉన్న ప్రజలు 16 లక్షల మంది ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలగా.. ఇప్పటి వరకు కేవలం 3 లక్షల ఇండ్లకు అంటే 19 శాతం లోపే సర్వే పూర్తయిందని అధికారులు చెబుతున్నారు. అర్బన్‌‌లో రాష్ర్టానికి రూ.1.13 లక్షలు మంజూరు చేసిన కేంద్రం.. రూరల్‌‌లో ఒక్క ఇంటిని కూడా ఇప్పటి వరకు మంజూరు చేయకపోవటం గమనార్హం. 

సవాలక్ష రూల్స్..  

పీఎం ఆవాస్ యోజన స్కీం కింద కేంద్ర ప్రభుత్వం అర్బన్ లో ఒక్కో ఇంటికి రూ.1.50 లక్షలు , రూరల్‌‌లో అయితే ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇస్తోంది. అయితే రూరల్ లో ఇళ్లు ఇవ్వాలంటే రూల్స్ కఠినంగా ఉన్నాయని హౌసింగ్ అధికారులు అంటున్నారు. రాష్ర్ట ప్రభుత్వం చేసిన సర్వే వివరాలను పీఎం ఆవాస్ కు అనుసంధానం చేయాలని కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులను కోరగా అందుకు ససేమీరా అన్నారు. తమ యాప్ ప్రకారం సర్వే చేయాల్సిందే అని కేంద్రం స్పష్టం చేయటంతో మళ్లీ సర్వే చేస్తున్నారు. దేశంలో అన్ని రాష్ర్టాలు చేస్తున్నట్లుగా సర్వే చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. 

యాప్ లో  లబ్ధిదారుడి ఫొటోతో పాటు ఐరిస్ ఐడెంటిఫికేషన్ సహా కొన్ని రూల్స్ కఠినంగా ఉన్నాయని హౌసింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ సర్వేలో 40 ప్రశ్నల ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. ఇందులో ఇంటి వద్ద ఫొటో తీసి యాప్‌‌లో అప్‌‌లోడ్ చేయడం కూడా ఉంది. ఒక్కో ఇంటి వివరాల సేకరణకు అరగంట పైగా టైం పడుతోంది. యాప్ లాగిన్ సమస్యలు, రూరల్ ప్రాంతాల్లో నెట్ స్లో వంటి సమస్యలున్నాయని అధికారులు చెబుతున్నారు. పీఎం ఆవాస్ యాప్‌‌లో 40 ప్రశ్నలు ఉండటంతో అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ సర్వేలో తక్కువ ప్రశ్నలతో వివరాలు తీసుకున్నామన్నారు.

 రూరల్ లో స్పీడ్ గా ఇండ్లు.. 

రాష్ర్టంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మొత్తం 3 లక్షల ఇండ్లు సాంక్షన్ చేయగా ఇందులో 2 లక్షల ఇండ్ల నిర్మాణం స్టార్ట్ కాగా ఇప్పటి వరకు లబ్ధిదారులకు రూ.700 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. ఇళ్ల ఓపెనింగ్ స్టార్ట్ కాగా, ఈనెల 21న సీఎం ఖమ్మం జిల్లాలో సీఎం ఇందిరమ్మ ఇళ్లను  ప్రారంభించనున్నారు. అర్బన్ లో మాత్రం సొంత జాగాలు ఉన్న వాళ్లు చాలా తక్కువ మంది ఉండటంతో జీ ప్లస్ 3 పద్ధతిలో ఇందిరమ్మ టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో జీహెచ్ ఎంసీలో కొన్ని ప్లేస్ లు ఎంపిక చేయగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది.  రూరల్ సర్వే, ఇళ్లు సాంక్షన్ చేయకపోవటంపై రాష్ర్ట ప్రభుత్వం గుర్రుగా ఉంది. 

ఢిల్లీకి వెళ్లినపుడు , హైదరాబాద్ వచ్చినపుడు కేంద్ర హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను సీఎం, హౌసింగ్ మంత్రి పొంగులేటి  తెలంగాణ కు ఇళ్లు కేటాయించాలని కోరగా ఇంత వరకు రూరల్ లో మంజూరు చేయలేదు. దీంతో ఇటీవల హౌసింగ్ మంత్రి కేంద్రం రూరల్ లో ఇళ్లు ఇవ్వకపోయినా రాష్ర్ట ప్రభుత్వం 100 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు రూ.5 లక్షలు అందజేస్తుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రూ.5 లక్షల ఇంటి వ్యయంలో రూ.72 వేలు తక్కువ అని ఆయన చిట్‌‌చాట్‌‌లో వ్యాఖ్యలు చేశారు.