- యూనియన్ బ్యాంకులో బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జ్ అయ్యే అవకాశం
- అదే జరిగితే రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా అవతరణ
- ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్‌లో ఇండియన్ బ్యాంక్!
- పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో కూడా వాటాలు అమ్మే అవకాశం
- ఖర్చులు తగ్గించి, ఎఫిషియెన్సీ పెంచడమే టార్గెట్
న్యూఢిల్లీ: పెద్ద బ్యాంకుల అవసరాన్ని గుర్తించిన కేంద్రం, మరోసారి ప్రభుత్వ బ్యాంకుల విలీనానికి రెడీ అవుతోంది. ఈసారి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియాను విలీనం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇదే జరిగితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తర్వాత దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఈ కొత్త సంస్థ ఎదుగుతుంది. న్యూస్‌పేపర్ మింట్ రిపోర్ట్ ప్రకారం, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైతే రెండు బ్యాంకులు చేసే ఒకే విధమైన పనులను తగ్గించొచ్చు.
ముఖ్యంగా బ్యాంకుల సైజ్‌ను పెంచడంపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.18.62 లక్షల కోట్ల ఆస్తులతో రెండో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్‌గా ఉంది. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ తర్వాత ఇది నాలుగో అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనమైతే, కొత్త సంస్థ ఆస్తుల విలువ రూ.25.67 లక్షల కోట్లకు పెరుగుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ స్థాయికి చేరుతుంది.
ఇతర బ్యాంకుల్లోనూ..
చెన్నై కేంద్రంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ విలీనాన్ని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి తక్కువ ఆస్తులు కలిగిన బ్యాంకుల్లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ 15న మనీకంట్రోల్ పబ్లిష్ చేసిన రిపోర్ట్ ప్రకారం, భారత బ్యాంకింగ్ రంగంలో మరోసారి ప్రభుత్వ బ్యాంకుల విలీనం జరిగే అవకాశం ఉంది.
చిన్న బ్యాంకులను పెద్ద బ్యాంకులతో కలిపి, బలమైన, సమర్థవంతమైన సంస్థలను నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీంతో అప్పులివ్వడాన్ని పెంచడం, ఆర్థిక రంగ సంస్కరణలకు మద్దతివ్వడం మరింత ఈజీ అవుతుందని అంచనా. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి తక్కువ ఆస్తులు కలిగిన బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద బ్యాంకుల్లో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, 2017 నుంచి 2020 మధ్య కాలంలో ప్రభుత్వం 10 ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసి, వాటిని నాలుగు పెద్ద బ్యాంకులుగా మార్చింది. దీంతో ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కి తగ్గింది. ఆ సమయంలో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం అయ్యాయి. అలాగే కెనరా బ్యాంక్‌లో సిండికేట్ బ్యాంక్ కలిసింది.
ఇండియా వంటి పెద్ద దేశంలో లార్జ్ సైజ్ బ్యాంకుల అవసరం చాలా ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. విలీనాల వలన ఖర్చులు తగ్గించుకోవచ్చని, ఎఫిషియెన్సీ మెరుగవుతుందని భావిస్తున్నారు. బ్యాంకుల విలీనాలతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడగల, బలమైన, మెరుగైన మూలధనం ఉన్న బ్యాంకులు ఏర్పాటు అవుతాయని తెలిపారు.
