
గోదావరిఖని, వెలుగు: బీఆర్ఎస్ తో పొత్తు ఉన్నా, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీల అమలుపై పోరాడుతామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం గోదావరిఖనిలోని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన రామగుండం నియోజకవర్గ పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దోబూచులాడుతోందన్నారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌లను ఎలాంటి షరతులు లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజ్, కలవేణి శంకర్, తాండ్ర సదానందం, మడ్డి ఎల్లా గౌడ్, గౌతం గోవర్ధన్ తదితరులున్నారు.