-
25 రాత్రి స్వామి వారి కల్యాణం, 27న స్వామి వారి అగ్ని గుండాలు
నార్కట్‌పల్లి, వెలుగు: ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమై 30 వరకు జరగనున్నాయి. శివలింగాల మాదిరిగా కాకుండా కొండ లోపల పశ్చిమ ముఖంగా ఎత్తుపల్లాలతో జడల మాదిరిగా స్వామి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. అందుకే స్వామివారిని జడల రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు. ఈ జాతరను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే భక్తులకు గుట్ట కింద, గట్టుపై మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు...
జాతరకు వచ్చే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా నార్కట్ పల్లి, నల్గొండ , హయత్ నగర్ సూర్యాపేట , దేవరకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనున్నారు. 20 నిమిషాలకు ఒక బస్సు చొప్పున వచ్చేలా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నార్కట్‌పల్లి నుంచి వెళ్లే పల్లె వెలుగు బస్సులను చెర్వుగట్టు మీదుగా నడిపించనున్నారు. గుట్ట కింద ప్రత్యేకంగా బస్టాండ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించారు.
భద్రత కట్టుదిట్టం...
బ్రహ్మోత్సవాల్లో పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు చేపట్టింది. నలుగురు డీఎస్పీలు,20 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 92 మంది ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుల్స్ 150 మంది కానిస్టేబుల్స్, 102 మంది హోంగార్డులు,102మంది మహిళ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బందులు కలిగితే నార్కట్‌పల్లి సీఐ, నార్కట్‌పల్లి ఎస్ఐ 8712670186 నెంబర్లను సంప్రదించాలని భక్తులకు సూచించారు. ప్రత్యేకంగా ఫోన్ నెంబర్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
అగ్నిగుండాలు ప్రత్యేకం...
వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని భక్తుల కోరుకుంటారు. అందులో భాగంగా పండించిన కందులు, ఆముదాలు అగ్నిగుండంలో వేసి మొక్కులు తీర్చుకోవడం అనవాయితీ. ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు ఈ అగ్నిగుండంలో నడుస్తారు.
భక్తులకు అన్ని వసతులు
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. గుట్టపై మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం కల్పించాం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రసాదాలకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఈఓ సల్వాది మోహన్ బాబు
