
సిమ్లా: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో 1984లో చేపట్టిన ‘ఆపరేషన్బ్లూస్టార్’.. ఓ తప్పుడు నిర్ణయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్నేత పీ చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని గోల్డెన్టెంపుల్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆమె చేసిన పొరపాటుకు తగిన మూల్యం చెల్లించుకున్నారని పేర్కొన్నారు. ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని కసౌలిలో జరిగిన ఓ సాహిత్య కార్యక్రమంలో చిదంబరం మాట్లాడారు.
‘‘నేను మిలిటరీ ఆఫీసర్లను అగౌరవపరచడం లేదు. కానీ, గోల్డెన్టెంపుల్ను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అది తప్పుడు మార్గం. కొన్నేండ్ల తర్వాత సైన్యాన్ని దూరంగా ఉంచి దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సరైన మార్గాన్ని మేం చూపించాం. ఆ పొరపాటుకు ఇందిరాగాంధీ తన ప్రాణాన్ని కోల్పోయారని నేను అంగీకరిస్తున్నా” అని తెలిపారు.
అది సమిష్టి నిర్ణయం..
అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్న మిలిటెంట్లను పట్టుకునేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్బ్లూస్టార్’పై చిదంబరం మాట్లాడారు. ఈ ఆపరేషన్చేపట్టాలని కేవలం ఇందిరా గాంధీ మాత్రమే నిర్ణయం తీసుకోలేదని, ఇది సైన్యం, పోలీసులు, నిఘా, పౌర సేవల సమిష్టి నిర్ణయమని చెప్పారు. దీనికి ఇందిరా గాంధీని మాత్రమే నిందించడం సరికాదని పేర్కొన్నారు. ప్రస్తుతం పంజాబ్‌లో ఖలిస్థానీ మద్దతుదారుల సంఖ్య చాలా తగ్గిపోయిందని అన్నారు.
చిదంబరంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆపరేషన్ బ్లూస్టార్‌పై చిదంబరం చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది. బీజేపీ లైన్‌లో చిదంబరం మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్నేత రషీద్అల్వీ విమర్శించారు. ఆయన ఏమైనా ఒత్తిడిలో ఉన్నారేమోనని ఎద్దేవా చేశారు.
‘‘ఆపరేషన్ బ్లూ స్టార్ సరైనదా..? కాదా..? అనేది ఇప్పుడు చర్చనీయాంశం కాదు. కానీ 50 ఏండ్ల తర్వాత చిదంబరం.. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి కారణమేంటి..? ఇందిరా గాంధీ తప్పటడుగు వేసిందని చెప్పడం ద్వారా.. బీజేపీ, మోడీ చేసేదే ఆయన చేస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. పార్టీ ద్వారా అన్నీ పొందిన సీనియర్ నాయకుడు బాధ్యతగా మాట్లాడాలని కాంగ్రెస్వర్గాలు సూచించాయి.