వలస వెళ్తూ అలసిన ఏనుగులు

వలస వెళ్తూ అలసిన ఏనుగులు

చైనాలో ఏనుగుల మాహా పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది. 15 ఏనుగులు ఏడాది నుంచి నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి. ఎందుకు వెళ్తున్నాయనేది ఇప్పటికీ కనిపెట్ట లేకపోతున్నారు. దీంతో ఈ ఏనుగుల గుంపు చేస్తున్న పాదయాత్ర ఇంటర్నేషనల్ గా వైరల్ అయింది. గతేడాది యునాన్  ప్రావిన్స్ లోని అభయారణ్యం నుంచి ఈ 15 ఏనుగుల గుంపు బయటకు వచ్చింది. అప్పటి నుంచి అవి ఇలా నడుస్తూనే ఉన్నాయి. గతేడాది మొదలైన వీటి పాదయాత్ర ప్రస్తుతం కున్మింగ్  నగరానికి చేరుకుంది. సాధారణంగా ఏనుగులు అడవిలోని తమ ఆవాసాల నుంచి పెద్దగా బయటకు రావు. కానీ ఈ చైనా ఏనుగుల గుంపు మాత్రం నగరాల్లో తిరిగేస్తోంది. ఏడాదికిపైగా అవి జనావాసాల్లోనే తిరుగుతున్నాయి. గుంపులోని ఈ 15 ఏనుగులు ఇప్పటికే 500 కిలోమీటర్లు ప్రయాణించాయి. మార్గమధ్యంలో పంట పొలాలపై దాడి చేస్తూ వెళ్తున్నాయి. దాంతో ఇప్పటికే 7 కోట్ల రూపాయలకు పైగా నష్టం వచ్చింది. ఇక నగరాల్లోకి ఏనుగులు వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయి.

ఏనుగుల గుంపు ప్రయాణాన్ని 410 మందున్న స్పెషల్ టీం 24 గంటలు మానిటర్ చేస్తోంది. పెద్ద సంఖ్యలో వాహనాలు, 14 డ్రోన్ల సాయంతో ఏనుగుల కదలికలపై నిఘా పెట్టారు. ఏనుగులు ఎందుకింత దూరం నడుచుకుంటూ వెళ్తున్నాయనేది ఇప్పటికీ తేలడం లేదు. రుచికరమైన పంటలు, ఫలాలు కోసమే ప్రయాణిస్తున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గుంపును లీడ్ చేస్తున్న ఏనుగుకు అనుభవం లేకపోవడం వల్లే అడవులు విడిచి వచ్చినట్లు కూడా భావిస్తున్నారు.