
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సీఐ శ్రీను చెప్పారు. శనివారం మండలంలోని ఇర్కోడ్ మోడల్ స్కూల్ లో టీచర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మహిళల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ నూతన చట్టాల్లో నేరస్తులకు కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు పదే పదే ఫోన్ చేస్తే ఆ నంబర్ ను బ్లాక్ చేయాలని సూచించారు. అనుకోకుండా సైబర్ నేరాల బారిన పడితే వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. స్టూడెంట్స్ ప్రవర్తనను గమనిస్తూ డ్రగ్ రహిత జిల్లాకోసం సహకరించాలని కోరారు.
ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా 2కే రన్
పహెల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం చేసిన ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా మండలంలోని రాఘవపూర్ గ్రామంలో గ్యార ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ శ్రీను పాల్గొని మాట్లాడారు. పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో గ్రామం తరపు నుంచి పాల్గొని వచ్చిన శ్రవణ్ గౌడ్ ను ఆదర్శంగా తీసుకొని యువత దేశ సేవ కోసం ముందుకు రావాలని సూచించారు అనంతరం 2కే రన్ లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందించారు.
నూతన విధానాల ద్వారా విద్యా ప్రమాణాలు పెంచాలి..
జిన్నారం : మండలంలోని చెట్ల పోతారం జడ్పీ హై స్కూల్లో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న టీచర్ల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ముగించారు. మండల ఇన్చార్జి ఎంఈవో కుమారస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ రవీందర్ రెడ్డి, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కళింగ కృష్ణ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన విధానాల ద్వారా స్టూడెంట్స్‌కు బోధిస్తే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్స్, రిటైర్డ్ పీడీ సత్యనారాయణ, టీచర్లు, సీఆర్పీలు పాల్గొన్నారు.