- ప్రైవేట్ కంపెనీలకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నెలకొన్న ఆటో ఎల్‌పీజీ కొరతపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర బుధవారం హైదరాబాద్లోని ఎర్రమంజిల్లో గల తెలంగాణ పౌర సరఫరాల భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రైవేట్ గ్యాస్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 110 బంకుల్లో ఆటో ఎల్‌పీజీ సరఫరాలో ఈ ప్రైవేట్ కంపెనీల వాటా సుమారు 80 శాతం ఉండటాన్ని ప్రస్తావిస్తూ.. అన్ని మార్గాల ద్వారా వెంటనే గ్యాస్ దిగుమతి చేసి సరఫరా పెంచాలని కమిషనర్ ఆదేశించారు.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎల్‌పీజీ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపాలున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా ఆటో డ్రైవర్లకు గ్యాస్ అందేలా చూడటం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతమని పేర్కొన్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న పరిస్థితుల ప్రభావం వల్ల డొమెస్టిక్ ఎల్‌పీజీ సరఫరా సాధారణంగానే కొనసాగుతున్నప్పటికీ, ఆటో ఎల్‌పీజీ సరఫరా సుమారు 35 శాతం మేర తగ్గినట్లు తెలిపారు.
