ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ విలేజ్ లో.. వీడీసీ, గౌడ కులస్తుల మధ్య ఘర్షణ

ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్  విలేజ్ లో.. వీడీసీ, గౌడ కులస్తుల మధ్య ఘర్షణ
  • ఉద్రిక్తత, భారీగా పోలీసుల మోహరింపు
  • 144 సెక్షన్ అమలు, గ్రామం మీదుగా రాకపోకలు బంద్

బాల్కొండ, వెలుగు: నిజామాబాద్​ జిల్లా ఎర్గెట్ల మండలం తాళ్ల రాంపూర్​ విలేజ్​లో వీడీసీ, గౌడ కులస్తుల మధ్య ఘర్షణ చెలరేగింది. కొంతకాలంగా గ్రామంలో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటుండగా, తాజాగా గ్రామంలోని ఓ ఇంటి ముందు ఉన్న ఈత చెట్టును వీడీసీ నరికివేసింది. దీనిని వ్యతిరేకించిన గీత కార్మికులు సోమవారం ఆందోళనకు దిగారు. గౌడ కులస్తులు పోలీసులకు  సమాచారం ఇవ్వడంతో గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలతో మాట్లాడుతున్న సమయంలో కొందరు వీడీసీ సభ్యులు దాడికి దిగారు. వెహికల్స్, ఫర్నిచర్  ధ్వంసం చేశారు. 

భయాందోళనకు గురైన గీత కార్మికులు వారి సంఘ భవనంలో తలదాచుకున్నారు. కొందరు సంఘ భవనంలోకి దూసుకెళ్లి అందులోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టుపై కూడా వీడీసీ సభ్యులు దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీస్  కమిషనర్  సాయి చైతన్యకు జర్నలిస్టులు కంప్లైంట్  చేశారు. ఆయన ఆదేశాలతో మంగళవారం గ్రామంలో 1,200 మంది పోలీసులు మోహరించారు. 

గ్రామంలో 144 సెక్షన్​ ప్రకారం ఆంక్షలు విధించారు. ఇండ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు ప్రచారం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. చట్టాన్ని ఎవరూ చేతిలోకి తీసుకోవద్దని సీఐలు శ్రీధర్ రెడ్డి, సత్యనారాయణ హెచ్చరించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తాళ్ల రాంపూర్​ గ్రామం మీదుగా వెళ్లకుండా దారి మళ్లించారు.