హుజూరాబాద్​లో ఓడించినందుకే రైతులపై కక్ష 

హుజూరాబాద్​లో ఓడించినందుకే రైతులపై కక్ష 
  • సీఎం కేసీఆర్​పై ఎంపీ అర్వింద్​ మండిపాటు
  • రైతులకు ఉచిత ఎరువులు ఎప్పుడిస్తరని ప్రశ్న
  • ఓటర్లకు డబ్బు పంపిణీపై ఐటీ దాడులు జరిగే చాన్స్

హైదరాబాద్​, వెలుగు: హుజూరాబాద్​లో టీఆర్​ఎస్​ను ఓడించినందుకే రైతులపై సీఎం కేసీఆర్​ కక్షగట్టారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్​ మండిపడ్డారు. మంగళవారం బీజేపీ స్టేట్​ ఆఫీస్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల మీద ఓ వీధిరౌడీలాగా ఇష్టమొచ్చినట్టు కేసీఆర్​ మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్​లో కవితను ఓడించినప్పుడు చెరుకు, పసుపు రైతులపై పగబట్టారని, ఇప్పుడు హుజూరాబాద్​లోనూ అలాగే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనబోమంటూ కేంద్రం లేఖ రాసిందని సీఎం చెప్తున్నారని.. ఆ లేఖను బయటపెట్టాలని ఆయన డిమాండ్​ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. కేంద్రం మెడలు వంచైనా తెలంగాణ సాధిస్తానని ఉద్యమంలో కేసీఆర్​ అనలేదా అని ప్రశ్నించారు. 
మతితప్పి మాట్లాడుతున్నరు
సంజయ్​ను ఆరు ముక్కలు చేస్తానన్న కేసీఆర్​ మాటలపై అర్వింద్​ మండిపడ్డారు. కేటీఆర్​పై జనం లో నమ్మకం పోవడంతోనే కేసీఆర్​ మతితప్పి మాట్లాడుతున్నారన్నారు. రైతులకు శుభవార్త చెప్తానని ఏండ్లు గడిచిపోయాయని విమర్శించారు. ఫ్రీగా ఎరువులు ఇస్తామన్న హామీని ఎప్పుడు నిలబెట్టుకుంటారో చెప్పాలన్నారు.  ఎనిమిదేండ్లలో ఒక్కసారైనా రైతులకు కేసీఆర్​ పంట బోనస్​ ఇచ్చారా? అని ప్రశ్నించారు. హుజూరాబాద్​లో ఓటర్లకు డబ్బు పంచిన ఘటనలపై ఇన్​కం ట్యాక్స్​ దాడులు జరిగే చాన్స్ ఉందన్నారు. విచారణకు ముందే కేసీఆర్​కు సీబీఐ అధికారులు వ్యాక్సిన్​ వేస్తే మంచిదన్నారు. కేసీఆర్​కు దుబాయ్​ శేఖర్​ అనే ముద్దు పేరు ఉందని గుర్తు చేశారు. నోటిఫికేషన్లు రాక నిరాశలో ఉన్న యువత రోడ్డెక్కబోతున్నారని అన్నారు. పద్మ అవార్డులంటే దొంగ పాస్​పోర్టులు ఇచ్చినట్టు కాదని కేసీఆర్​ గుర్తుంచుకోవాలన్నారు. పద్మ అవార్డుల కోసం రాష్ట్రం నుంచి ఒక్కరి పేరు కూడా ఎందుకు సిఫార్సు చేయలేదో చెప్పాలన్నారు. కల్యాణలక్ష్మి తరహా పథకాన్ని శివరాజ్​సింగ్​ చౌహాన్​ మధ్యప్రదేశ్​లో 2007లోనే అమలు చేశారని అర్వింద్​ గుర్తు చేశారు.