వడ్ల సేకరణకు సెప్టెంబర్​లో FCI అంగీకారం..అయినా క్లారిటీ లేదన్న సీఎం

వడ్ల సేకరణకు సెప్టెంబర్​లో FCI అంగీకారం..అయినా క్లారిటీ లేదన్న సీఎం
  • 60 లక్షల టన్నుల వడ్ల సేకరణకుసెప్టెంబర్​లో ఎఫ్​సీఐ అంగీకారం 
  • కొనే టైంలో.. సాగు లెక్కలు పెంచి లెటర్​ రాసిన రాష్ట్ర సర్కారు 
  • కోటీ 30 లక్షల టన్నుల వడ్లు తీసుకోవాలని ప్రతిపాదన
  • ఇప్పటికీ సగం కూడా ఓపెన్​ కాని కొనుగోలు సెంటర్లు
  • ఎక్కడ అమ్ముకోవాల్నో తెలియక ఆగమైతున్న రైతులు


హైదరాబాద్​, వెలుగు: ఒక దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతులు తిప్పలు పడుతుంటే.. అధికార పార్టీ లీడర్లు మాత్రం వడ్ల చుట్టూ రాజకీయాలకు తెరలేపారు. రైతుల సమస్యలు పక్కన పెట్టి సీఎం కేసీఆర్​ ఫక్తు పాలిటిక్స్​ స్టార్ట్​ చేశారు. దగ్గరుండి రైతు సమన్వయ సమితులతో  చివరి ధాన్యపు గింజ వరకు కొనేలా చూస్తామని పోయిన సీజన్​ వరకు చెప్పిన ఆయన.. ఇప్పుడు వడ్ల కొనుగోళ్ల అంశాన్ని పూర్తిగా ఢిల్లీ వైపు మళ్లించారు. కేంద్రమే వడ్లన్నీ కొనాలని, స్వయంగా అధికార పార్టీ  శుక్రవారం నుంచి  వడ్ల కొనుగోళ్లపై ధర్నా చేస్తుందని సీఎం ప్రకటించటం రైతుల్లో గందరగోళానికి దారితీసింది. రాష్ట్రంలో వానాకాలానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 40 లక్షల టన్నుల రా రైస్​ (60 లక్షల టన్నుల వడ్లు) సేకరణకు ఓకే చెప్పింది. కానీ, ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై చేతులెత్తేయటంతో సమస్య జటిలంగా మారింది. రాష్ట్రంలో 6 వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఓపెన్​ చేయాల్సి ఉండగా, ఇప్పటి దాకా కేవలం 2,780 కేంద్రాలనే రాష్ట్ర ప్రభుత్వం తెరిచింది. 4 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొన్నది. తెరిచిన ఆ కొన్ని సెంటర్ల వద్దకు రైతులు తమ వడ్లను అమ్ముకుందామని వెళ్తే.. అక్కడి సిబ్బంది టోకెన్ల పేరిట సతాయిస్తున్నారు. దీంతో రైతులు అడ్డికి పావుసేరుకు మిల్లర్లకు అమ్ముకొని నష్టపోతున్నారు. వడ్లు అమ్ముకునేందుకు రోజుల తరబడి ఎదురుచూస్తూ నాలుగు రోజుల కింద  కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ రైతు వడ్ల కుప్ప మీదనే  గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు.  

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎఫ్​సీఐ) రెండు నెలల ముందే వానాకాలం వడ్ల కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నదనే దానిపై వివరాలు అడిగి తీసుకుంది. ‘‘ఎంత వరి సాగైంది? ఎకరా దిగుబడి ఎంత ? మొత్తంగా ఎంత ఉత్పత్తి వస్తుంది?” అనే వివరాలను సెప్టెంబర్​ నెలలోనే రాష్ట్ర సివిల్​ సప్లయ్స్​, అగ్రికల్చర్​ డిపార్ట్​మెంట్​ కలిసి ఎఫ్​సీఐకి రిపోర్ట్​ పంపాయి. దీంట్లో  53.33 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, 1.27 కోట్ల టన్నుల ధాన్యం వస్తుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం.. అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్న వరి దిగుబడికి తగ్గట్టుగా తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల రా రైస్​ తీసుకుంటామని, ఆ మేరకు 60 లక్షల టన్నుల వడ్ల సేకరణకు సెప్టెంబర్‌లోనే ఎఫ్​సీఐ ఓకే చెప్పి.. కొనుగోళ్లు జర పాలని చెప్పింది. అసలు కేంద్రం వానాకాలం వడ్లు ఎంత సేకరించాలో చెప్పలేదని సీఎం ఎదురుదాడికి దిగుతుండటం రైతుల్లో ఆందోళనకు దారి తీసింది. కొనుగోళ్లు చేపడ్తారా లేదా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కొనే టైంలో.. లెక్కలు మార్చి..!

సాగు లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడంతో  40 లక్షల టన్నుల రా రైస్ (60 లక్షల టన్నుల వడ్లు) కు అనుమతించినట్లు ఎఫ్​సీఐ చెప్తునది. తెలంగాణ నుంచి ముందు 32.43 లక్షల టన్నుల రా రైస్​కు ఓకే చెప్పామని, అయితే స్టేట్​ గవర్నమెంట్​ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు  దానిని 40 లక్షల టన్నులకు చేర్చామని పేర్కొంటున్నది. అయితే, కొనుగోళ్లు ప్రారంభించే సమయానికి (అక్టోబర్​ 13న).. సాగు మరింత పెరిగిందని, దీంతో దిగుబడి ఇంకా ఎక్కువగా వస్తున్నందున 90 లక్షల టన్నుల రా రైస్​(కోటి 30 లక్షల టన్నుల వడ్లు) తీసుకోవాలని రాష్ట్ర సర్కార్​ ఎఫ్​సీఐని కోరింది. 15–20 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా సాగు విస్తీర్ణం పెంచి చూపడంతో  వివరాలు మరోసారి పంపాలని ఎఫ్ సీఐ స్పష్టం చేసింది. ఎఫ్​సీఐ టార్గెట్​ ప్రకారం 60 లక్షల టన్నుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం సేకరించాల్సి ఉన్నా, ఆ దిశగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయడం లేదు.  

అగ్రి చట్టాలపై మారిన మాట

వడ్ల కొనుగోళ్లను పక్కన పెట్టడమే కాకుండా కేంద్రం తీసుకువచ్చిన అగ్రి చట్టాలపై సీఎం మరోసారి మాట మార్చారు. చట్టాలను విత్​ డ్రా చేసుకోవాలని ప్రకటన చేశారు. చట్టాలు వచ్చిన కొత్తలో అగ్రి చట్టాలను వ్యతిరేకించారు. కింది స్థాయి కార్యకర్త నుంచి మంత్రుల వరకు చట్టాలకు వ్యతిరేకంగా బంద్​లో పాల్గొని,  ఆందోళన కార్యక్రమాలు చేశారు. ఆ రెండు రోజులకే ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చి కేసీఆర్.. తర్వాత​ మాట మార్చారు. కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు మంచివేనని అనుకూలంగా మాట్లాడారు. తాజాగా ఇప్పుడు మళ్లీ అగ్రి చట్టాలపై యూ టర్న్​ తీసుకోవటంతో పాటు వడ్ల కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆందోళనకు దిగుతాననడం చర్చనీయాంశంగా మారింది.