మోదీకి ఎందుకు ఓటెయ్యాలె?..రైతులను కాల్చి చంపినందుకా.?: రేవంత్

మోదీకి ఎందుకు ఓటెయ్యాలె?..రైతులను కాల్చి చంపినందుకా.?: రేవంత్
  •     బెంగళూరు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నా కేంద్రం పట్టించుకోలే
  •     బెంగళూరు కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి మన్సూర్​ అలీఖాన్​ తరఫున ప్రచారం
  •     కర్నాటక నుంచి 20 మంది కాంగ్రెస్​ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి

హైదరాబాద్​, వెలుగు: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ.. అన్నదాతలను కాల్చి చంపించారని, అందుకు ఆయనకు ఓటేయాలా? అని సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పి పదేండ్లలో కేవలం 7,21,680 ఉద్యోగాలే ఇచ్చారని మండిపడ్డారు. దేశంలో 62 శాతం యువత నిరు ద్యోగ సమస్యతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. దేశాన్ని నిరుద్యోగ సమస్య పట్టి పీడి స్తున్నా పట్టించుకోని మోదీని మరోసారి గెలిపించుకోవాలా? అని అడిగారు. శనివారం రేవంత్​రెడ్డి బెంగళూరులో ఆ లోక్​సభ స్థానం నుంచి బరిలో నిలిచిన మన్సూర్​ అలీఖాన్​కు మద్దతుగాఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెంగళూరుకు ఐటీ నగరంగా గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్​ పార్టీ అని, కాంగ్రెస్​ వల్లే ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని తెలిపారు. బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్​ను గెలిపిస్తే బెంగళూరుకు ఏం చేశారని నిలదీశారు. నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన నిధులపై పార్లమెంట్​లో ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా నిధులివ్వాలని కేంద్రాన్ని అడగలేదని విమర్శించారు. కావేరీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని ఏనాడూ పార్లమెంట్​లో మాట్లాడలేదన్నారు. కేవలం పల్లీ, బఠానీలు తినడానికి పార్లమెంట్​ సెంట్రల్​ హాలుకు  పోవాల్సిన అవసరం లేదని, అవి బెంగళూరు బస్టాండ్​లో కూడా దొరుకుతాయని చురకలంటించారు. కర్నాటకలో కాంగ్రెస్​ పార్టీని 20 స్థానాల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. తెలంగాణలో 17కు 14  ఎంపీ సీట్లు గెలిపించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు.

కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదు

నరేంద్ర మోదీ అంటేనే నమ్మించి మోసం చేయడమని రేవంత్​రెడ్డి విమర్శించారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు బీజేపీ నేతలకు లేదన్నారు. ‘‘యడ్యూరప్ప మీ ఎలక్షన్ కమిషన్ మెంబర్. ఆయన కొడుకు విజయేంద్ర కర్నాటక పార్టీ అధ్యక్షుడు. ఆయన కొడుకు రాఘవేంద్ర ఇప్పుడు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నడు. పక్క రాష్ట్రంలో ప్రమోద్ మహాజన్ కూతురు ఎంపీ. గోపీనాథ్ ముండే ఇద్దరు కూతుళ్లు ఎంపీలు. రాజ్ నాథ్ సింగ్ కేంద్ర మంత్రి.. ఆయన కొడుకు ఎమ్మెల్యే. మీ పార్టీలో ఉన్నోళ్లంతా చేసేవి కుటుంబ రాజకీయాలే. మీరా కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడేది?’’ అని మండిపడ్డారు. బీజేపీ నేతలు అవినీతి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘దేవెగౌడ, ఆయన కుమారుడు దేశంలోనే అత్యంత అవినీతిపరులని శాసనసభ ఎన్నికల్లో మోదీ అన్నారు. మరి ఈ ఎన్నికల్లో మోదీ  వారితో పొత్తు ఎలా పెట్టుకున్నారు? ఆ అవినీతిపరులను పక్కనెలా కూర్చోబెట్టుకున్నారు? మోదీ చెప్పేదొకటి.. చేసేదొకటి. మోదీకి కావాల్సింది కేవలం ఎన్నికల్లో గెలవడమే.. కర్నాటక  ప్రజల సంక్షేమం కాదు’’ అని విమర్శించారు. ‘‘ఇచ్చిన మాట ప్రకారం కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు గ్యారంటీలను అమలు చేసింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ కు ఓటు వేస్తారా? నమ్మించి మోసం చేసే నమోకు ఓటు వేస్తారా? ఆలోచన చేయండి’’ అని ప్రజలను రేవంత్​రెడ్డి కోరారు.

కర్నాటకకు ఒక్కటే మంత్రి పదవా?

గుజరాత్ కు 7 కేబినెట్ పదవులు.. యూపీకి 12 కేబినెట్ పదవులు.. కానీ 27 ఎంపీలను ఇచ్చిన కర్నాటకకు కేవలం ఒక్క కేబినెట్ పదవి ఇచ్చారని రేవంత్​ రెడ్డి మండిపడ్డారు. ఇది కన్నడ ప్రజలను అవమానించడం కాదా? అని ప్రశ్నించారు. ‘‘యూపీ, గుజరాత్ లోనే సమర్థులు ఉన్నారా?  కర్నాటక, తెలంగాణలో లేరా? ఇవి ఎన్నికలు కాదు.. రెండు పరివార్​ల మధ్య జరిగే యుద్ధం. ఈవీఎం, ఈడీ, ఇన్ కం ట్యాక్స్, సీబీఐ, ఆదానీ, అంబానీ అంతా మోదీ పరివార్. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ,  ఖర్గే, సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ మా పరివార్. ఈ ఎన్నికల్లో కర్నాటక నుంచి 20 మంది ఎంపీలను గెలిపించండి. మన్సూర్ అలీ ఖాన్ కు మద్దతుగా నిలవండి’’ అని రేవంత్​రెడ్డి కోరారు.