
- మీడియాతో చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
- జర్నలిస్టుల హెల్త్‌కార్డుల సమస్యను పరిష్కరిస్తానని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదం ఆలస్యమైనా, ఆర్డినెన్స్కుఆమోదం రాకపోయినా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ముందున్న ప్రత్యామ్నాయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేసి, స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. దీనిపై ఈ నెల 23న జరిగే కాంగ్రెస్ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. మీడియా సమావేశం అనంతరం జర్నలిస్టులతో సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు. ‘‘బీసీ బిల్లులు రాష్ట్ర పతి దగ్గర 4 నెలలుగా పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులపై నిర్ణయానికి సంబంధించి రాష్ట్రపతికి సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువు అంశంపై విచారణ కొనసాగుతున్నది.
దీనిపై క్లారిటీ వస్తే రిజర్వేషన్లపై స్పష్టత వస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం” అని తెలిపారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్‌ను కలుస్తారా? అని ప్రశ్నించగా.. ‘‘ఇండియా కూటమి ఏం నిర్ణయిస్తే అదే చేస్తాను. అయినా కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో.. ఆయనకు నా ముఖం చూడటం ఇష్టం ఉందో లేదో” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఆస్పత్రిలో ఉంటే తాను వెళ్లి పరామర్శించానని గుర్తు చేశా రు. ‘‘రాజ్యాంగ పరిరక్షణ కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి ఎంపిక చేసింది.
ఇది నా నిర్ణయం కాదు.. ఇండియా కూటమి నిర్ణయం. నేను రెగ్యులర్‌గా జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని కలుస్తాను. ఈ నెల 21న ఆయన నామినేషన్ కార్యక్రమానికి వెళ్తాను” అని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ఉన్నందున తానేమీ చేయలేనని, అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. హెల్త్‌కార్డుల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.