
- అవసరమైన అన్నిసహాయక చర్యలు తీసుకోండి: సీఎం రేవంత్ రెడ్డి
- ఎస్ఎల్బీసీ సహాయక చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష
- పర్యవేక్షణకు ప్రత్యేకాధికారిగా శివశంకర్‌ను నియమించాలని ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరం దగ్గరుండి పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారి శివశంకర్ లోతేటిని ప్రత్యేకాధికారిగా నియమించాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన సహాయక చర్యల పురోగ తిని సోమవారం మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాల్ లో రేవంత్ సమీక్షించారు.
ప్రమాదానికి గురైన కార్మికుల ఆచూకీ కనుక్కునేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ఆయన సూచించారు. అత్యవసర పనులకు కేంద్రం నుంచి అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు. మిగతా కార్మికులను గుర్తించేందుకు ఆపరేషన్ కొనసాగించాలని, అవసరమైన అన్ని ప్రత్యామ్నాయాలను అనుసరించాలన్నారు. ప్రమాద స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యల పురోగతిని విపత్తు నిర్వహణ విభాగం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, కల్నల్ పరీక్షిత్ మెహ్రా సీఎంకు వివరించారు.
కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ విభాగాలతో పాటు ప్రైవేటు సంస్థలన్నీ కలిపి 25 ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయని చెప్పారు. మొత్తం 700 మంది ఈ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యారని తెలిపారు. సొరంగంలో కూలిన రాళ్లు, టీబీఎం విడిభాగాలను వెల్డింగ్ చేసి బయటకు తీస్తున్నామని, పేరుకున్న మట్టి, రాళ్లదిబ్బలు, పూడిక, ఊట నీటిని బయటకు తొలగిస్తున్నామని చెప్పారు. సహాయక చర్యలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ప్రదర్శించారు.
టీఎంబీ వర్కవుట్ కాకపోతే బయట నుంచే!
సొరంగం నుంచి కార్మికుల మృతదేహాలను వెలికితీసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం డ్రిల్ అండ్ బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంలో ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల ప్రకారం.. గల్లంతైన ఏడుగురు సిబ్బంది కుటుంబాలకు పరిహారం చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అనుమానిత ప్రాంతాలైన డీ-1, డీ-2 వద్ద తవ్వకాలు జరిపినా ఇప్పటికీ ఆనవాళ్లు కూడా లభించలేదు.
ఇక డీ-1 నుంచి ప్రమాదం జరిగిన ప్రదేశం వరకూ 50 మీటర్ల మేర సహాయక చర్యలు చేపట్టే పరిస్థితి లేదు. అక్కడ రెస్క్యూ చేపట్టేందుకు రోబోటిక్స్‌ను లోపలికి పంపినా ఫలితం లేదు. ఎస్ఎల్బీసీ పనులు టీఎంబీతో వర్క్ అవుట్ కాకపొతే బయట నుంచి పనులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఇందుకోసం ఫారెస్ట్ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో వెలిగొండ సొరంగం విషయంలోనూ పర్మిషన్స్ తీసుకున్న దానిపై అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం టీఎంబీ మిషిన్లు ఉన్న ప్రాంతం.. లోపలి నుంచి భూ ఉపరితలానికి 510 మీటర్ల ఎత్తులో ఉంది.