V6 News

వచ్చే పదేండ్లలో తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడులు పెడ్తం

వచ్చే పదేండ్లలో తెలంగాణలో లక్ష కోట్ల పెట్టుబడులు పెడ్తం
  • ఇన్వెస్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ పరిచారు 
  • ఆయన ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉంది 
  • ట్రంప్ కంపెనీ బోర్డు డైరెక్టర్ ఎరిక్ స్వైడర్  కామెంట్

హైదరాబాద్, వెలుగు:  వచ్చే పదేండ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడ్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన కంపెనీ ‘ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్’ (ట్రూత్ సోషల్) మాజీ సీఈవో, బోర్డ్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. గ్లోబల్ సమిట్‌లో ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థల ద్వారా తెలంగాణలోని ఫ్యూచర్ సిటీలో, ఇతర రంగాల్లో రూ.లక్ష కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ‘‘మేం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలంటే మూడు అంశాలను పరిశీలిస్తాం. పెట్టుబడికి తగిన లాభాలు రావడం, ఆ పెట్టుబడి సమాజంలో దీర్ఘకాలిక మార్పును తీసుకురావడంతో పాటు పెట్టుబడులను స్వాగతించే వాతావరణం ఉండాలి.  

ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్ పరిచారు. గత 20 ఏండ్ల కింద అమెరికా నుంచి చూస్తే భారత్ అంటే కేవలం ‘కాల్ సెంటర్ల దేశం’గా మాత్రమే కనిపించేది. కానీ నేడు పరిస్థితి మారింది. ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో పని చేస్తున్న ప్రతిభావంతులు భారత్ నుంచే వస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెట్టుబడిదారులు కూడా ఇండియా నుంచే పుడుతున్నారు. టెక్నాలజీలో ఇండియా ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా  ఉంది” అని అన్నారు.

 ‘‘సీఎం రేవంత్ రెడ్డి ఆతిథ్యం కూడా అద్భుతంగా ఉంది. ఆయన నన్ను ఎంతగానో ఆదరించారు. కేవలం రెండు రోజుల్లోనే నేను పొందిన గౌరవం, ఆతిథ్యం ఇంతకు ముందెన్నడూ ఎక్కడా చూడలేదు. ఇక్కడి స్వాగతం చూశాక.. నేను మా ఇంటికి ఫోన్ చేసి, ఇకపై నేను గదిలోకి వస్తే పూలతో స్వాగతం పలకాలని నా భార్యకు చెప్పాను. కానీ ఆమెకు అది అంతగా నచ్చలేదు” అంటూ చమత్కరించారు.  

లక్ష మంది రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతం :టీవీఎస్ మొబిలిటీ చైర్మన్,దినేశ్  

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న తెలంగాణ ప్రభుత్వ లక్ష్యానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పూర్తి సహకారం అందిస్తుందని సీఐఐ మాజీ అధ్యక్షుడు, టీవీఎస్ మొబిలిటీ చైర్మన్ ఆర్.దినేశ్ తెలిపారు. రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా దాదాపు 50 వేల నుంచి లక్ష మంది రైతులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. గ్లోబల్ సమిట్‌లో దినేశ్ మాట్లాడుతూ.. ‘‘ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు. ప్రపంచమంతా తెలంగాణతో చేతులు కలిపి సమగ్ర వృద్ధిని సాధించేందుకు దొరికిన వేదిక. పెట్టుబడులను తెలంగాణకు రప్పించేందుకు, పాలసీల రూపకల్పనలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం” అని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్‌ బాగుందని కొనియాడారు. ‘‘వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ నిలవడానికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యలే కారణం. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం హర్షణీయం” అని పేర్కొన్నారు.  

మరిన్ని పెట్టుబడులు పెడ్తం: కరణ్ అదానీ 

గత మూడేండ్లలో తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టిందని, తద్వారా 7 వేల మందికి పైగా ఉపాధి లభించిందని అదానీ పోర్ట్స్​ఎండీ కరణ్ అదానీ వెల్లడించారు. భవిష్యత్తులో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడ్తామని తెలిపారు. గ్లోబల్ సమిట్‌లో కరణ్ అదానీ మాట్లాడుతూ.. ‘‘సీఎం రేవంత్ రెడ్డి పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాల వల్లే పరిశ్రమలు ధైర్యంగా, నమ్మకంతో తెలంగాణలో పెట్టుబడులు పెడ్తున్నాయి. 

రాష్ట్ర భవిష్యత్తును సీఎం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు” అని కొనియాడారు. తెలంగాణలో రూ.2,500 కోట్ల పెట్టుబడితో 48 మెగావాట్ల గ్రీన్ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని.. ఇది ఏఐ,  క్లౌడ్ టెక్నాలజీ, హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరాలను తీరుస్తుందని చెప్పారు.  

పీపుల్స్ ఫస్ట్​ విధానం అద్భుతం: డబ్ల్యూఈఎఫ్‌ ఎండీ జెరెమీ జర్గన్స్  

‘తెలంగాణ రైజింగ్’ విజన్ కేవలం భారీ భవనాలు, పరిశ్రమలకే పరిమితం కాకుండా.. ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ పీపుల్స్​ఫస్ట్​విధానం రూపొందించడం అద్భుతమని వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) మేనేజింగ్ డైరెక్టర్, సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ హెడ్ జెరెమీ జర్గన్స్ ప్రశంసించారు. గ్లోబల్ సమిట్‌లో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతూ.. మహిళలు, యువత, రైతులను అభివృద్ధిలో భాగస్వాములను చేయడం ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలన్న ప్రభుత్వ లక్ష్యం ప్రపంచ నగరాలకు ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని అన్నారు. 

హెల్త్ పాలసీ ఉండాలి 

అన్ని రంగాల్లో లాగే వైద్య రంగంలోనూ హెల్త్ పాలసీ ఉండాలని అపోలో హాస్పిటల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శోభన కామినేని అన్నారు. గ్లోబల్ సమిట్‌లో ఆమె మాట్లాడుతూ.. గత 38 ఏండ్లుగా రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నామని, భవిష్యత్తులోనూ పెడ్తామని తెలిపారు. తెలంగాణలో పంపిణీ అవుతున్న మొత్తం మందుల్లో 25 శాతం అపోలో సంస్థ నుంచే వెళ్తున్నాయని చెప్పారు. ‘గ్లోబల్ రైజింగ్’ అనే పదం సీఎం రేవంత్​రెడ్డికి  సరిగ్గా సరిపోతుందని, ఆయన చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేకమైన ఎనర్జీ ఉంటుందని కొనియాడారు. 

సార్.. మీరు మెస్సీతో కలిసి గోల్ కొడతారని నేను ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు. ‘‘38 ఏండ్ల కింద మేం హైదరాబాద్‌కు వచ్చి మా రెండో ఆసుపత్రి నిర్మించాం. అప్పుడు మాకు కేటాయించిన భూమి రాళ్లతో నిండి ఉండేది. కానీ ఆ ప్రాంతమే ఇప్పుడు జూబ్లీహిల్స్​ గా మారింది.  ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులతో పాటు పారిశ్రామికవేత్తలు కల్పించే వసతులు కూడా కీలకం” అని అన్నారు. -అపోలో హాస్పిటల్స్ ఈడీ శోభన కామినేని