పదేళ్ల క్రితం విడాకులు.. ఇప్పుడు మళ్లీ సహజీవనం.. ఒక్కటైన స్టార్ కపుల్

పదేళ్ల క్రితం విడాకులు.. ఇప్పుడు మళ్లీ సహజీవనం.. ఒక్కటైన స్టార్ కపుల్

సినీ ప్రపంచంలో విడాకులు తీసుకోవడం, విడిపోవడం సర్వసాధారణం. కానీ, విడిపోయిన తర్వాత, చేదు జ్ఞాపకాలను చెరిపేసి మళ్లీ ఒక్కటవ్వడం మాత్రం అత్యంత అరుదు. ఇప్పుడు అచ్చం ఇలాంటి మ్యాజిక్కే మలయాళ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్, మాజీ నటి లిజీ లక్ష్మి జీవితంలో జరిగింది. 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్న ఈ జంట, పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ సహజీవనం మొదలుపెట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారారు.

 'ఈగో' తోనే విడాకులు..

1990లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియదర్శన్, లిజీల బంధం 24 ఏళ్ల పాటు సాఫీగానే సాగింది. అయితే, 2014లో వీరిద్దరి మధ్య మనస్పర్థలు మొదలై కోర్టు మెట్లెక్కారు. 2016 సెప్టెంబర్‌లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. ఆ సమయంలో లిజీ తన విడాకుల ప్రక్రియను "అత్యంత భయంకరమైన యుద్ధం"గా అభివర్ణించారు. కోర్టు లోపల, బయట జరిగిన గొడవలు తమ వైవాహిక జీవితంలోని అశాంతికి నిదర్శనమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రియదర్శన్ సైతం తమ విడిపోవడానికి "ఈగో"  ప్రధాన కారణమని అప్పట్లో బహిరంగంగానే ఒప్పుకున్నారు.

పిల్లల కోసం..

వీరిద్దరినీ మళ్లీ దగ్గర చేయడంలో వారి పిల్లలు, నటి కల్యాణి ప్రియదర్శన్, కుమారుడు సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించారు. ఎనిమిది నెలల క్రితమే ఈ జంట మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఒకరికొకరు తోడుగా ఉండటం, స్నేహం, గౌరవం ముఖ్యం తప్ప.. పెళ్లి అనే ఒక కాగితపు ముక్క తమకు అవసరం లేదని వీరు భావిస్తున్నారు. అందుకే, వీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో లేరని సమాచారం.

మమ్ముట్టి ఆశీస్సులు.. 

ఇటీవల మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, చెన్నైలోని లిజీకి చెందిన 'లే మ్యాజిక్ లాంతర్న్' స్టూడియోకు వెళ్లారు. అక్కడ ప్రియదర్శన్, లిజీలను కలిసిన మమ్ముట్టి, వారి పునఃకలయిక పట్ల ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో వస్తున్న 'పేట్రియాట్' సినిమా వాయిస్ రికార్డింగ్ కోసం వెళ్లిన ఆయన, ఈ జంటతో కాసేపు సరదాగా గడిపారు.

మరోసారి పెళ్లి చేసుకుంటారా?

ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ మినహా, మేమిద్దరం ఇప్పుడు సాధారణ భార్యాభర్తల్లాగే కలిసి జీవిస్తున్నాం అని ప్రియదర్శన్ అన్నారు. మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ప్రస్తుతానికి లేదు అని స్పష్టం చేశారు. హృతిక్ రోషన్-సుసానే, అమలాపాల్-విజయ్ వంటి వారు విడిపోయాక కూడా గౌరవంగా ఉంటే, తాము మాత్రం కోర్టు గొడవలతో ఇబ్బంది పడ్డామని, ఇప్పుడు ఆ పాత గాయాలను మర్చిపోయి ప్రశాంతంగా ఉన్నామని వారు భావిస్తున్నారు. పదేళ్ల విరామం తర్వాత ఈ సీనియర్ జంట మళ్లీ ఒక్కటవ్వడం చూసి అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. "ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.