ఇస్లామాబాద్: తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం రావడంతో పాక్ ప్రభుత్వం హైఆక్టేన్ ఇంధన ధరను ఏకంగా 200 శాతం పెంచింది. లగర్జీ వెహికల్స్లో ఈ హై ఆక్టేన్ పెట్రోల్ను ఇంధనంగా వాడతారు.
దాదాపు లీటర్ పెట్రోల్పై రూ. 300 పెంచుతూ పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మార్చి మొదటి వారంలో లీటరుకు 55 రూపాయల మేర పెంచడంతో, ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 321.17కు, డీజిల్ ధర రూ. 335.86కు చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం వల్ల పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం తీవ్రమైంది.
హార్మూజ్ జలసంధి మూత పడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 60 డాలర్ల నుంచి 100 డాలర్లకు పెరిగింది. పొదుపు చర్యల్లో భాగంగా అన్ని ప్రభుత్వ ఆఫీసులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పనిచేస్తాయి. బ్యాంకులకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 50 శాతం సిబ్బంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి. పెళ్లిళ్లు, పార్టీలకు గరిష్టంగా 200 మంది మాత్రమే హాజరు కావాలి. ప్రజాప్రతినిధులు, ఆధికారుల విదేశీ పర్యటనలను రద్దు. అత్యవసరమైతే ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకొని వెళ్లాలి. పెట్రోల్, డీజిల్ అక్రమంగా నిల్వ చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
