కేవలం గంటలోపే రూ.250లక్షల కోట్ల సంపద ఆవిరి..ట్రంప్-ఇరాన్ ప్రకటనల వెనుక అసలు వాస్తవమిదే!

కేవలం గంటలోపే రూ.250లక్షల కోట్ల సంపద ఆవిరి..ట్రంప్-ఇరాన్ ప్రకటనల వెనుక అసలు వాస్తవమిదే!

హైదరాబాద్: అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక మాట.. ఒక ట్వీట్ ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తుందో చెప్పడానికి సోమవారం నాటి స్టాక్ మార్కెట్ పరిణామాలే నిదర్శనం. కేవలం 56 నిమిషాల వ్యవధిలో, రెండు పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల ఏకంగా 3 ట్రిలియన్ డాలర్ల  అంటే సుమారు రూ.250 లక్షల కోట్లు మార్కెట్ విలువ తలకిందులైంది. ఈ వికృత క్రీడపై ‘ది అసెన్ట్ బిగిన్స్’ రచయిత, ప్రముఖ విశ్లేషకుడు షనక అన్స్లెమ్ పెరేరా చేసిన విశ్లేషణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

ఏం జరిగింది? ఆ 56 నిమిషాల డ్రామా ఏంటి?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్​ సోషల్​ వేదికగా ఒక ప్రకటన చేశారు. "ఇరాన్‌తో చర్చలు సఫలమయ్యాయి.. ఐదు రోజుల పాటు దాడులను నిలిపివేస్తున్నాం" అని ఆయన చెప్పడమే ఆలస్యం, కుప్పకూలుతున్న మార్కెట్లు ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచాయి. కేవలం నిమిషాల్లోనే ఎస్ అండ్ పీ (S&P) మార్కెట్ విలువకు 2 ట్రిలియన్ డాలర్లు తోడయ్యాయి.

అయితే, ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. సరిగ్గా కొద్దిసేపటికే ఇరాన్ స్పందిస్తూ.. "అమెరికాతో మాకు ఎలాంటి సంప్రదింపులు లేవు" అని తేల్చి చెప్పింది. అంతే! మార్కెట్ నుంచి మళ్ళీ 1 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది.

డిజిటల్ మాయాజాలం.. క్షేత్రస్థాయిలో జరిగింది శూన్యం

ఈ మొత్తం ఉదంతంపై షనక అన్స్లెమ్ పెరేరా తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. డిజిటల్ అల్గారిథమ్స్‌కు, భౌతిక వాస్తవాలకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఎండగట్టారు.  సోషల్ మీడియాలో ఇద్దరు వ్యక్తులు పోస్ట్‌లు పెడతారు.. అల్గారిథమ్స్ ట్రిలియన్ల కొద్దీ డాలర్లను అటు ఇటు మారుస్తాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఆ 56 నిమిషాల డ్రామా నడుస్తున్నప్పుడు హార్ముజ్ జలసంధి ఒక్క క్షణం కూడా తెరచుకోలేదు. ఒక్క ట్యాంకర్ కదలలేదు. ఒక్క బ్యారెల్ ముడి చమురు లోడ్ అవ్వలేదు." - షనక అన్స్లెమ్ పెరేరా ఆవేదన వ్యక్తం చేశారు. 

పెరేరా ప్రస్తుత పరిస్థితులను ఇలా  విశ్లేషించారు. మార్కెట్ విలువలు పెరిగినా, తగ్గినా.. వాస్తవానికి టీఎస్ఎంసీ (TSMC)కి చేరాల్సిన హీలియం చేరలేదు.. ఎరువుల రవాణా ఆగిపోయింది.. ఐఈఏ (IEA) ధృవీకరించిన 40 ఇంధన వనరులు ఇంకా ధ్వంసమయ్యే ఉన్నాయి.. బాల్టిక్ తీరంలో మంటలు ఆరలేదు.. ఈ మాటల యుద్ధం వల్ల దక్షిణాసియాలో పంటలు వేయాల్సిన సమయం మరో 6 గంటలు వృధా అయింది. ఈ వ్యవసాయంపై దెబ్బ భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీయవచ్చని పెరేరా వివరించారు. 

ఇంకా మనం ఇప్పుడు ఒక వింత యుద్ధంలో ఉన్నాం" అని పెరేరా హెచ్చరించారు. మార్కెట్ ధరలు కేవలం మాటల మీద మారుతున్నాయి కానీ, వాస్తవంలో ఒక్క 'అణువు' కూడా కదలడం లేదు. "ఆ చమురు అణువులకి 'ట్రూత్ సోషల్' చదవడం రాదు. ఇరాన్ ప్రభుత్వ మీడియా వార్తలు వాటికి తెలియవు. వాస్తవాలకోసం నిరీక్షిస్తున్నాయి ’’అంటూ ఆయన ప్రస్తుత ప్రపంచ క్రమం ఎంతటి ప్రమాదకర స్థితిలో ఉందో వివరించారు.

ప్రస్తుత వ్యవస్థల పతనాన్ని, నూతన ప్రపంచ క్రమాన్ని విశ్లేషించే పెరేరా చేసిన ఈ పోస్ట్, అల్గారిథమ్స్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా క్షేత్రస్థాయి సమస్యలను విస్మరిస్తుందో స్పష్టం చేస్తోంది.