- ఎల్పీజీ అవసరాల్లో 60శాతం దిగుమతులపై ఆధారం
- గల్ఫ్ లోని భారతీయుల భద్రతకు ప్రాధాన్యం
- పశ్చిమాసియా నుంచి 3.75 లక్షల మంది భారతీయులను రప్పించాం
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం
- మూడు వారాలుగా కొనసాగుతున్న ఘర్షణపై ప్రధాని ఆందోళన
- లోక్ సభలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ఢిల్లీ: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నప్పటికీ దేశానికి ఇంధన సరఫరాపై ఎలాంటి అంతరాయం రాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ లో చేసిన ప్రకటనలో యుద్ధ ప్రభావాలను తగ్గించేందుకు నిరంతరం కృషి కొనసాగుతుం దని, అన్ని రంగాల భాగస్వాములతో సమస్వయం చేస్తూ ప్రభావితులకు అవసరమైన మద్దతు అందిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా దేశవ్యాప్తంగా కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. సామాన్యులపై వీటి ప్రభావం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధాని చెప్పారు. దేశ అవసరాల్లో సుమారు 60 శాతం ఎల్పీజీ దిగుమతులపై ఆధారపడుతున్నప్పటికీ సరఫరా అనిశ్చిత పరిస్థితుల్లో దేశీయ వినియోగానికి ప్రాధాన్యం ఇస్తూ ఉత్పత్తిని పెంచుతున్నామని వెల్లడించారు.
3.75 లక్షల మంది స్వదేశానికి రప్పించాం
గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్నామని స్పష్టం చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతీయులకు నిరంతర సహాయం అందిస్తూ ఇప్పటివరకు 3.75 లక్షల మందిని స్వదేశానికి రప్పించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు దేశాధినేతలతో కూడా చర్చలు జరిపినట్లు, భారతీయుల భద్రతపై వారు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. గత మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అందుకే త్వరిత పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక నిల్వలు
ఇంధనం భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమని, పశ్చిమాసియా దేశాలు ప్రధాన వనరుగా కొనసాగుతున్నాయని తెలిపారు. సరఫరా నిరంతరత కోసం పలు దేశాలతో నిరంతర సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. హర్మూజ్ జలసంధి మార్గంలో చిక్కు కున్న భారత నౌకలు సురక్షితంగా తిరిగి చేరాయని వెల్లడించారు. దేశానికి 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయని, 41 దేశాల నుంచి ఇంధన దిగుమతులు జరుపుతున్నామని తెలిపారు.
ప్రపంచంపై యుద్ద ప్రభావం
గత మూడు వారాలుగా కొనసాగుతున్న ఈ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ప్రధాని తెలిపారు. ఈ పరిస్థితుల్లో త్వరిత పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయని పేర్కొన్నారు.
