కొండారెడ్డిపల్లె ముస్తాబు.. దసరాకు సొంతూరుకు రానున్న సీఎం

కొండారెడ్డిపల్లె ముస్తాబు.. దసరాకు సొంతూరుకు రానున్న సీఎం
  • దసరాకు సొంతూరుకు రానున్న సీఎం 
  • గ్రామ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు
  • అభివృద్ధి పనులపై అధికారుల ఫోకస్​
  • చివరి దశకు చేరుకున్న అభివృద్ధి పనులు

కొండారెడ్డిపల్లి (నాగర్ కర్నూల్), వెలుగు​: కొండారెడ్డిపల్లెను అధికారులు అందంగా ముస్తాబు చేస్తున్నారు. సీఎం రేవంత్​రెడ్డి దసరా పండుగకు తన సొంతూరు నాగర్​కర్నూల్​జిల్లా, వంగూరు మండలం కొండారెడ్డిపల్లెకు రానున్నారు. దీంతో అధికారులు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. గ్రామంలోని రోడ్లు, కాలనీలను పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. సీఎంగా రేవంత్​రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత సొంతూరు కొండారెడ్డిపల్లి రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టారు.  అందుకోసం నిధులు కేటాయించారు. దసరా పండగ రోజున సీఎం రేవంత్​రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లిపాటు వంగూరు మండల కేంద్రంలో విస్తృతంగా అభివృద్ధి పనులు చేపట్టారు. 

గ్రామాభివృద్ధికి భారగా నిధులు మంజూరు..

కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి గతంలో రూ.50 కోట్లు మంజూరు కాగా, ప్రస్తుతం మరో రూ.170 కోట్లను మంజూరు చేశారు. 20 రోజుల్లో అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గేటు నుంచి పోల్కంపల్లి వరకు నాలుగులైన్ల రోడ్డు కోసం రూ.16 కోట్లు, పాఠశాలలో అదనపు గదులు, మరమ్మతుల కోసం రూ.3.70 కోట్లు, అండర్‌‌ డ్రైనేజ్‌‌ నిర్మాణం కోసం రూ.18 కోట్లు, పశువైద్యశాల నిర్మాణానికి రూ.45 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్‌‌కు రూ.58 లక్షలు, లైబ్రరీ బిల్డింగ్‌‌రూ.55 లక్షలు, జీపీ బిల్డింగ్, ప్రహరీకి రూ.72 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌‌రూ.20 లక్షలు, 30 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన బల్క్‌‌ మిల్క్‌‌ కూలింగ్‌‌ సెంటర్‌‌ యూనిట్‌‌ నిర్మాణానికి రూ.2.50 కోట్లు, మాడ్రన్‌‌ బస్‌‌షెల్టర్‌‌ నిర్మాణానికి రూ.24 లక్షలు, బీసీ కమ్యూనిటీ హాల్‌‌ ప్రహారీ నిర్మాణానికి రూ.12 లక్షలు, చిన్నపిల్లల ఆట స్థలం నిర్మాణం కోసం రూ.14 లక్షలు, రైతువేదిక ఆధునీకరణ కోసం రూ.19 లక్షలు, ఓపెన్‌‌ జిమ్‌‌ కోసం రూ.18 లక్షలు, ఎస్సీ కమ్యూనిటీ హాల్‌‌ మరమ్మతు కోసం రూ.9 లక్షలు, విద్యుత్‌‌ లైన్ల మార్పు, కొత్త లైన్ల ఏర్పాటు కోసం రూ.2,85 కోట్లు, మెయిన్‌‌ రోడ్డులో ఎల్‌‌ఈడీ లైట్ల ఏర్పాటు కోసం రూ.40 లక్షలు, చెట్లు, గ్రీనరీ ప్లానిటేషన్‌‌ కోసం రూ.20 లక్షలు మంజూరయ్యాయి. 

పనులు ముమ్మరం..

సోలార్​ విద్యుత్ పైలట్​ప్రాజెక్ట్‌‌ కింద కొండారెడ్డిపల్లిని ఎంపిక చేసి పనులు ముమ్మరం చేశారు. టీఎస్‌‌ఎస్‌‌ డీపీఎల్‌‌ సీఎండీ ముషారఫ్‌‌ అలీ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని పలుమార్లు సందర్శించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని సోలార్‌‌ విద్యుత్ వ్యవస్థగా మారుస్తున్నారు. సోలార్‌‌ విద్యుత్​ ద్వారా గృహ, వ్యవసాయ, వాణిజ్య అవసరాలకు వాడుకుంటూ మిగులు విద్యుత్​ను ఆదాయం వనరుగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొండారెడ్డిపల్లి గ్రామంలోని 499 ఇండ్లు, 66 వ్యాపార, వాణిజ్య వినియోగదారులు, 867 రైతులకు సోలార్​ విద్యుత్​ అందించనున్నారు.  

వంగూరు మండలానికి ప్రస్తుతం కల్వకుర్తి 132/33 కేవీ సబ్‌‌స్టేషన్‌‌ నుంచి విద్యుత్‌‌ సరఫరా అవుతుంది. వంగూరు మండల విద్యుత్​ సప్లై కెసాసిటీ పెంచేందుకు పోల్కంపల్లి సమీపంలో రూ.45 కోట్లతో 132/33 కేవీ సబ్‌‌స్టేషన్‌‌ నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. గాజరలో  రూ.2 కోట్లతో 33/11 కేవీ విద్యుత్‌‌ సబ్‌‌స్టేషన్, మరో రూ.2 కోట్లతో కొండారెడ్డిపల్లి గ్రామంలోని విద్యుత్‌‌లైన్ల మార్పు కోసం పనులు కొనసాగుతున్నాయి. 

మండల కేంద్రానికి మహర్ధశ.. 

వంగూరు మండల కేంద్రంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రూ.66 కోట్లు, 30 పడకల ఆస్పత్రికి రూ.16 కోట్లు, వంగూరు నుంచి జూపల్లి వరకు బీటీ రోడ్డు కోసం రూ.7.3 కోట్లు, శ్రీశైలం నేషనల్‌‌ హైవే రాంనగర్‌‌ స్టేజీ నుంచి కొండారెడ్డిపల్లికి బీటీ రోడ్డు ఏర్పాటు కోసం రూ.5.12 కోట్లు, సోషల్‌‌ వెల్ఫేర్‌‌ రెసిడెన్షియల్‌‌ పాఠశాల కోసం రూ.3 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సర్వారెడ్డిపల్లి వయా వంగూరు, కొండారెడ్డిపల్లి మీదుగా జంగారెడ్డిపల్లి వరకు బీటీ డబుల్‌‌రోడ్డు కోసం రూ.30 కోట్లు మంజూరయ్యాయి.

అభివృద్ధి పనులపై ఫోకస్..

కొండారెడ్డిపల్లి, వంగూరు మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఫోకస్ పెట్టారు. అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అభివృద్ధి పనులపై చర్చించారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.