ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి : అనుదీప్ దురిశెట్టి

ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించాలి :  అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం టౌన్, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చెప్పారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ఆయన అధ్యక్షతన శుక్రవారం హాస్పిటల్ డెవలప్​మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుడా కింద జిల్లా దవాఖానలో 13 అభివృద్ధి పనులను రూ.25 కోట్లతో చేపట్టామని తెలిపారు. రూ.23.75 కోట్లతో నిర్మిస్తున్న 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. 

పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలందించేందుకు అవసరమైన యంత్రాల కొనుగోలు, దవాఖానలో సీసీరోడ్లు, ఇతర సౌకర్యాల కల్పనకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఖమ్మం ఆస్పత్రికి కార్పొరేట్ లుక్ తీసుకుని రావాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, డీఎంహెచ్​వో కళావతి బాయి, ఆస్పత్రి సూపరింటెండెంట్ నరేందర్, డీసీహెచ్ఎస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 

ఈవీఎంల గోడౌన్ తనిఖీ 

కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎంల గోడౌన్ ను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అడిషనల్​కలెక్టర్ పి.శ్రీనివాస్​రెడ్డితో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్ చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టాలని ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. భద్రతా సిబ్బంది సమయపాలన పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎలక్షన్​సూపరింటెండెంట్ రాజు, డీటీ అన్సారీ, ఆర్అండ్ బీ ఏఈఈ లలిత తదితరులున్నారు.