ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ జితేశ్

 ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలి : కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ 

ములకలపల్లి, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​ వీ పాటిల్ ​వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని మంగపేట పీహెచ్​సీ, అంగన్​వాడీ సెంటర్​ను ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్​వాడీ కేంద్రంలో పిల్లలకు, గర్భిణులకు అందిస్తున్న పౌష్టికాహారంపై టీచర్​ను అడిగి తెలుసుకున్నారు.  పిల్లలకు రెగ్యులర్​గా పౌష్టికాహారం అందించాలని, గర్భిణులు, పిల్లలకు వ్యాధినిరోధక టీకాలు ఇప్పించాలని సూచించారు. అంగన్​వాడీ కేంద్రానికి ప్రహరీ లేక కోతులు, పాములతో ఇబ్బంది పడుతున్నామని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తేగా ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం  గిరిజన ప్రాథమిక పాఠశాలో విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు.

 మధ్యాహ్న భోజనానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులవిద్యాసామర్థ్యాలను పరీక్షించి అభినందించారు. విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యం, చదువు అత్యంత ప్రాధాన్యమైనవని, శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాలకు ఎగాలని ఆయన సూచించారు. సిబ్బంది పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. పాఠశాలకు త్వరలో అవసరమైన బెంచీలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం మంగపేట పీహెచ్​సీని సందర్శించి రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ గన్యా, ఆర్ఐ సత్యవతి,  హెచ్​ఎం కోటమ్మ, అంగన్​వాడీ టీచర్ సుజాత ఉన్నారు.