
- కలెక్టర్ రాహుల్ రాజ్
నిజాంపేట, రామాయంపేట, వెలుగు: జిల్లాలో భారీ వర్షాలు, వరదల వల్ల 11 మండలాల్లో నష్టం వాటిల్లిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం ఆయన రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో 130 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందన్నారు. మెదక్- ఎల్కతుర్తి నేషనల్ హైవే- 765 డీజీపై నందిగామ శివారులో కుంగిన బ్రిడ్జిని, చల్మెడ గ్రామంలో కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించారు.
ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, కల్వర్టులు, వంతెనలు చాలా ప్రాంతాల్లో కోతకు గురైనట్టు తెలిపారు. ఆయా చోట్ల తాత్కాలిక మరమ్మతులతో పాటు రవాణాను పునరుద్ధరించాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు.
హ్యామ్ పద్దతిలో బ్రిడ్జి నిర్మాణం: ఆర్డీవో జయచంద్రారెడ్డి
తూప్రాన్: హ్యామ్ పథకం కింద గుండ్రెడ్డి పల్లి హల్ది వాగు మీద బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఆర్డీవో జయచంద్రారెడ్డి తెలిపారు. తూప్రాన్ మండలం లోని కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జిలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కిష్టాపూర్ గ్రామానికి వెళ్లేందుకు నీటి ప్రవాహం తగ్గిందని ప్రజలు రాకపోకలు సాగించవచ్చన్నారు. గుండ్రెడ్డిపల్లికి వెళ్లే రోడ్డు నీటి ప్రవాహంతో పూర్తిగా దెబ్బతిన్న కారణంగా వాహనాల రాకపోకలు సాధ్యం కాదన్నారు. ఇందుకోసం 4.5 కోట్ల అంచనాతో కొత్త వంతెన ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. అనంతరం రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను సిబ్బందితో కలిసి పరిశీలించారు.