
- భూభారతి అప్లికేషన్లపై ఆఫీసర్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచనలు
ఆర్మూర్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూభారతి పైలెట్ ప్రాతిపాదికన మెండోరా మండలంలోని ఎనిమిది గ్రామాల్లో రైతు సదస్సుల్లో ద్వారా వచ్చిన 706 దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ, నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాలన్నారు. ఆర్మూర్ ఆర్డీవో ఆఫీస్ లో శుక్రవారం రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ మీటింగ్ ఏర్పాటు చేసి భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతిలోని నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే, తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ నిర్వహించగలుగుతారన్నారు. ముందుగా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులో వివరాలను సమగ్రంగా పరిశీలించాలని, అనంతరం ఫీల్డ్ విచారణ జరపాలన్నారు. ఈ నెల 12 నుండి దరఖాస్తుల పరిశీలన, ఫీల్డ్ ఎంక్వైరీ చేపట్టి, వారం రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఈ నెల 20 వ తేదీ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని దరఖాస్తుల విచారణ పూర్తి కావాలన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.