
- నెరవేరిన ముస్లింల చిరకాల కోరిక
- జేఏసీ ప్రతినిధులకు ప్రొసీడింగ్స్ అందజేసిన మంత్రులు వివేక్, పొన్నం, అడ్లూరి
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల చిరకాల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. శ్మశాన వాటిక (ఖబరస్తాన్)కు స్థలం కేటాయించాలని గత పదేండ్లుగా అక్కడి మైనార్టీలు ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వారి వినతిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇన్‌చార్జి మంత్రులుగా పనిచేస్తున్న డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో ఖబ్రస్తాన్‌కు స్థలం కేటాయించాలని వారిని ముస్లిం శ్మశాన వాటిక జేఏసీ కోరింది. ఆ ప్రతిపాదనలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి మంత్రులు తీసుకువెళ్లగా, ఎట్టకేలకు ప్రభుత్వం శ్మశాన వాటిక ఏర్పాటుకు స్థలం కేటాయించింది. ఆదివారం షేక్‌పేటలోని 2,500 గజాల స్థలాన్ని ముస్లిం శ్మశాన వాటిక కోసం కేటాయిస్తూ రెహమత్‌నగర్‌లోని హెచ్ఎఫ్ నగర్‌లో జేఏసీ ప్రతినిధులకు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ ప్రొసీడింగ్స్‌ను అందజేశారు.
ఎలాంటి వివాదం లేని స్థలాన్ని కేటాయించినం: మంత్రి అడ్లూరి
ఎలాంటి వివాదం లేని స్థలాన్ని ముస్లిం మైనార్టీల కోసం అందజేశామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. గత పదేండ్లుగా ఇక్కడి ముస్లిం మైనార్టీలు ఖబరస్తాన్ కావాలని ప్రతిపాదనలు పెట్టినా.. గత ప్రభుత్వం వారికి స్థలం కేటాయించలేదన్నారు. నేడు సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలో శ్మశాన వాటిక కోసం స్థలం కేటాయించడంతో ఎంతోమంది ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.
క్షేత్రస్థాయిలో ముస్లిం మైనార్టీలకు ఖబరస్తాన్ అవసరం ఉందని తమ దృష్టికి రావడంతో ప్రభుత్వం చొరవతో నేడు స్థలం కేటాయించడం సంతోషంగా ఉందని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, కాంగ్రెస్ నాయకులు అజారుద్దీన్, షబ్బీర్ అలీ, గుత్తా అమిత్‌రెడ్డి, పీవీ రవిశంకర్‌రెడ్డి, నవీన్ కుమార్, సీఎన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.