
- వరంగల్, గజ్వేల్ పంచాయితీలపై కమిటీలు వేయాలని నిర్ణయం
- రేపు జరిగే భేటీలో రాజగోపాల్ రెడ్డి అంశాన్ని చర్చిస్తామన్న కమిటీ చైర్మన్ మల్లు రవి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరును గమనిస్తున్నామని పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అన్నారు. మంగళవారం మరోసారి జరగనున్న కమిటీ భేటీలో ఈ అంశంపై చర్చిస్తామని చెప్పారు. ఆదివారం గాంధీ భవన్‌లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తమ దృష్టికి తీసుకువచ్చారని, వెంటనే కమిటీ స్పందించి ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తుందని చెప్పారు.
తర్వాతి మీటింగ్‌లో ఈ అంశాన్ని చర్చిస్తామన్నారు. వరంగల్ జిల్లాలోని కొండా మురళి.. అక్కడి పార్టీ ఎమ్మెల్యేల మధ్య నడుస్తున్న పంచాయితీపై ఓ కమిటీ వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని, కమిటీ వేసేందుకు పీసీసీ అనుమతి కూడా కోరినట్లు ఆయన వెల్లడించారు. గజ్వేల్‌లో పార్టీ నేతలపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి దాడి చేసిన విషయం కమిటీ దృష్టికి వచ్చిందని, ఆ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలోనే ఈ ఘటన జరగడంతో ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకుంటామన్నారు.
దీనిపై కూడా ఓ కమిటీని వేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం నలుగురితో ఓ కమిటీ వేస్తున్నామని, క్రమశిక్షణ కమిటీ సభ్యుడైన శ్యాం మోహన్ దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. అయితే, రాజగోపాల్ రెడ్డి అంశాన్ని పరిశీలించాలని క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శనివారం కోరడం, ఆ వెంటనే ఆదివారం కమిటీ సమావేశం కావడంతో కమిటీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని అంతా భావించారు. అయితే ఈ విషయంపై ఎలాంటి చర్చ లేకుండానే క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగియడం పీసీసీలో చర్చనీయాంశమైంది.