- మొదటి విడత 136 సర్పంచ్స్థానాల్లో 65 గెలిచిన కాంగ్రెస్
- పార్టీ నిర్మల్ జిల్లా క్యాడర్లో జోష్
నిర్మల్, వెలుగు: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవులకు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు తమ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. పోలింగ్‌రోజు మధ్యాహ్నం వరకు తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్నవారు ఫలితాలు తారుమారు కావడంతో తట్టుకోలేకపోతున్నారు. ప్రత్యర్థి కన్నా ఎక్కువ ప్రచారం చేయడంతోపాటు అన్ని రకాల ప్రయత్నాలు చేశామని.. ఫలితం వ్యతిరేకంగా రావడం ఏంటని తమ అనుచరులతో చర్చిస్తున్నారు. ఓటమి గల కారణాలపై వార్డుల వారీగా సమీక్ష జరుపుతున్నారు.
ఒక్కో వార్డులో ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. వాటిలో తమకు ఎన్ని పడ్డాయని ఆరా తీస్తున్నారు. ప్రత్యర్థులు పోలింగ్‌రోజు ఓటర్లకు డబ్బులు పంచడం తమ ఓటమికి కారణమైనట్లు పలువురు భావిస్తున్నారు. అలాగే తమ కులస్తులు, పార్టీలోని కొంతమంది నమ్మకద్రోహం చేశారంటూ కొందరు బాహాటంగానే వాపోతున్నారు.
విజేతల ఇండ్లలో విజయోత్సవాలు
సర్పంచ్‌లుగా గెలిచినవారి ఇండ్లు శుక్రవారం ఉదయం నుంచి విజయోత్సవాలతో సందడిగా కనిపించాయి. వారి అనుచరులు పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ప్రజలు తమ తమ గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ దే పైచేయి
నిర్మల్ జిల్లాలో మొదటి విడత జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్పైచేయి సాధించింది. మొత్తం 136 సర్పంచ్‌స్థానాలకు గానూ కాంగ్రెస్బలపరిచిన అభ్యర్థులు 65 చోట్ల గెలవడం పార్టీ క్యాడర్లో జోష్నింపింది. ఈ ఎన్నికల ఫలితాలే రెండో, మూడో విడతలోనూ వస్తాయని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండో విడత పోలింగ్ ఆదివారం జరగనుండటంతో మొదటి విడత ఫలితాలపై శుక్రవారం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు.
చాలా చోట్ల తక్కువ మెజార్టీనే..
నిర్మల్ జిల్లాలో మొదటి విడత పోలింగ్ జరిగిన 6 మండలాల్లో చాలాచోట్ల అభ్యర్థులు తక్కువ మెజార్టీతోనే గెలిచారు. లక్ష్మణ చాంద మండలంలో బాబాపూర్, ధర్మారం, తిరుపల్లి, చామన్ పల్లి, కనకాపూర్, మామడ మండలంలోని పరిమండల్, ఆదర్శనగర్, అనంతపేట్, గాయదిపల్లి, జగదాంబ తండా, జయరామ్ తండా గ్రామాల్లో అభ్యర్థులు 50, అంతకంటే తక్కువ ఓట్లతోనే విజయం సాధించారు. కడెం మండలంలో దిల్దార్ నగర్, మద్దిపడగ, ఉడుంపూర్, బాబానాయక్ తండా, న్యూ ధర్మాజీపేట, కల్లెడ, చిట్యాల్, కన్నాపూర్, నర్సాపూర్ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోయింది 50 ఓట్లలోపు తేడాతోనే.
పెంబి మండలంలో యాపల్ గూడ, శెట్టిపల్లి, వేణునగర్, కృష్ణ నాయక్ తండా, లోతర్య తండా, తాటిగూడ, గుమ్మెన, అంకెన, ఖానాపూర్ మండలంలోని మాస్కపూర్, ఎగ్బాల్ పూర్, కొత్తపే ట, బావాపూర్ (కె), సుర్జాపూర్, బీర్నంది, సింగపూర్, దస్తురాబాద్ మండలంలోని మున్యాల్ తండా, గోండు గూడ, దేవునిగుడెం, ఎర్రగుంట తదితర గ్రామాల్లోనూ అతి తక్కువ ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలుపొందారు.

