తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కొడుకు ఆమె అంత్యక్రియలకు ముందే ఆమె బాట పట్టాడు.ఈ విషాదకర సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. శుక్రవారం ( నవంబర్ 28 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. రెండు రోజుల క్రితం తప్పిపోయిన తల్లి మానేరు వాగులో దూకి ఆత్మహత్య చేసుకోగా ఆ విషాదాన్ని తట్టుకోలేని ఆమె కొడుకు పోలీసు కానిస్టేబుల్, అందరి ముందే అదే వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ లో పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న అభిలాష్ తన తల్లి గత రెండు రోజులుగా కనపడకుండా పోయారు.ఆమెకు సరిగా మతిస్థిమితం లేదు.రెండు రోజుల గాలింపు తర్వాత ఆమె మృతదేహం సిరిసిల్ల మానేరు వాగులో లభ్యమైంది. తల్లి మృతి విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కానిస్టేబుల్ అభిలాష్ కు సమాచారం అందించారు.దీంతో అభిలాష్ హుటాహుటిన మృతదేహం లభ్యమైన మానేరు వాగు వద్దకు చేరుకున్నారు.తన తల్లి నిర్జీవ దేహాన్ని చూసిన అభిలాష్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఆ క్షణాన ఏం చేయాలో తెలియక తల్లి మరణాన్ని తట్టుకోలేక...అక్కడున్న వారంతా చూస్తుండగానే ఒక్కసారిగా అదే మానేరు వాగులోకి దూకారు.
ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన అక్కడి ప్రజలు అభిలాష్‌ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, కొంతమందికి ఈత రాకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.వాగులో మునిగిపోయిన అభిలాష్‌ను రక్షించలేకపోయారు.సమాచారం అందుకున్న ఎస్ డి ఆర్ ఎఫ్ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
ALSO READ : కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే..
కొద్దిసేపు గాలించిన అనంతరం, వారు అభిలాష్ మృతదేహాన్ని వెలికి తీశారు. తల్లి, కొడుకులిద్దరూ ఒకే మానేరు వాగులో ఒకే రోజు మరణించడం ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ హృదయవిదారక ఘటనపై పలువురు పోలీసు అధికారులు మరియు సిబ్బంది తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.అభిలాష్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
