కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే.. వర్షాలు సరిగ్గా పడితే ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదు: MLC కవిత

కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే.. వర్షాలు సరిగ్గా పడితే ఆ ప్రాజెక్ట్ అవసరమే లేదు: MLC కవిత

హైదరాబాద్: బీఆర్ఎస్ వరల్డ్ వండర్‎గా డప్పు కొట్టుకునే కాళేశ్వరం ప్రాజెక్టుపై గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం (నవంబర్ 28) కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని.. ఆ ప్రాజెక్ట్ ద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షాలు మంచిగా కురిస్తే.. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమే లేదని అన్నారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు నీళ్లు అందలేదన్నారు. 

కాళేశ్వరం ప్యాకేజీలతో కాంట్రాక్టర్లకే డబ్బులు పోయాయని.. ప్రజలకు నీళ్లు మాత్రం రాలేదని ఆరోపించారు. కాళేశ్వరం గురించి మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు కంపనోర్లు వేసుకుంటున్నారని విమర్శించారు. నాపై కుట్ర చేసి కుటుంబానికి దూరం చేశారని.. నన్ను బీఆర్ఎస్ నుంచి బయటకి పంపినవారు శునకానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వరప్రదాయిని అంటూ బీఆర్ఎస్ నేతలు గొప్పులు చెప్పుకునే కాళేశ్వరం ప్రాజెక్ట్‎తో ఎలాంటి ఉపయోగం లేదని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత చెప్పడం గమనార్హం. 

కేసీఆర్‌‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్​సస్పెన్షన్ వేటు వేసిన తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కేసీఆర్. ఈ సందర్భంగా కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనకొండలు అని ఆరోపించారు. వీరి అవినీతి వల్లే కాళేశ్వరం విషయంలో కేసీఆర్‎ కు అవినీతి మరక అంటుకుందన్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన జాగృతి సంస్థ ద్వారా కవిత రాజకీయాలు చేస్తున్నారు. జాగృతి జనం బాట పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్‎పై కవిత చేస్తోన్న విమర్శలు ఆ పార్టీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయి.