ఆర్మూర్/కామారెడ్డిటౌన్/బాల్కొండ/బోధన్, వెలుగు : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు అంబేద్కర్ ఫొటోలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్, బాల్కొండ మండలంలోని స్కూళ్లు, కాలేజీల్లో అంబేద్కర్ఫొటోలకు నివాళులర్పించారు. ఆర్మూర్ టౌన్ లో కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
బోధన్ మండలం కల్దుర్కిలో బీఎస్పీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కృషి చిరస్మరణీయమన్నారు. దళిత, బహుజనుల ఆరాధ్య దైవం అంబేద్కర్ అని, అయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అంటరానితనాన్ని రూపుమాపి అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన మహానుభావుడు అంబేద్కర్అని కొనియాడారు.
