ఓఆర్ఆర్ టోల్ గేట్ల టెండర్లపై వివాదం

ఓఆర్ఆర్ టోల్ గేట్ల టెండర్లపై వివాదం

హైదరాబాద్, వెలుగు: ఔటర్ రింగు రోడ్డుపై టోల్ గేట్ల నిర్వహణ టెండర్ల ప్రక్రియ.. పాత సంస్థలకు లాభం చేసేలా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. వివరాల్లో గోప్యత, టెండర్ దాఖలుకు తక్కువ టైమ్ ఇవ్వడంపై ముంబైకి చెందిన ఓ సంస్థ కోర్టును ఆశ్రయించింది. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ పై 19 టోల్ గేట్లు ఉండగా.. కొత్తగా మరో రెండింటి నిర్మాణం సాగుతున్నది. రెండు సంస్థలు ఈ ప్లాజాలు నిర్వహిస్తున్నాయి. అక్టోబర్ నెలతో వాటి గడువు ముగిసింది. 18 నెలల పాటు టోల్ నిర్వహణకు 12 టోల్ ప్లాజాలకు ఒక టెండర్, 7 ప్లాజాలకు మరో టెండర్ చొప్పున హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్ టెండర్లను పిలిచింది. ప్రీ బిడ్డింగ్ దాఖలుకు అక్టోబర్15 నుంచి అదే నెల 29వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ప్రీబిడ్డింగ్​లో పాల్గొన్న సంస్థలే తుది టెండర్లలో పాల్గొనాలనే రూల్ పెట్టింది. ఇంత తక్కువ టైమ్​లో టెండర్లను స్టడీ చేయడం, అవసరమైన సమాచారం సేకరించుకోవడం కొత్త సంస్థలకు అసాధ్యమని ముంబైకి చెందిన ఓ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. అలాగే వివరాలు పూర్తిగా ఇవ్వకుండా.. గోప్యత పాటిస్తున్నారని ఆరోపించింది.

ఏటా రూ.500 కోట్ల రెవెన్యూ
ప్రస్తుతం టోల్ గేట్లు నిర్వహిస్తున్న రెండు సంస్థల్లో ఒకదానికి లాభం చేకూర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి టెండర్ ప్రకటించిన తర్వాత పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొంటారు. ప్రీ బిడ్డింగ్ సమావేశంలోనైనా టెండర్లు వేసే సంస్థలకు వివరిస్తారు. కానీ అవేవి లేకుండానే టెండర్ ప్రక్రియ కొనసాగిస్తున్నారని ముంబై సంస్థ ఆరోపించింది. ఔటర్​పై ట్రాఫిక్ పెరుగుతుండడంతో టెండర్ల ద్వారా ఏడాదికి రూ.450–- రూ.500 కోట్ల రెవెన్యూ వస్తుందని ఆశలు పెట్టుకున్న హెచ్ఎండీఏ గ్రోత్ కారిడార్​కు కోర్టు కేసు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో కోర్టు కేసు త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఆఫీసర్లపై ఒత్తిడి చేస్తున్నారు.