‘కూలీ’ సినిమాకు ఇండియాలో ‘A’ సర్టిఫికెట్‌.. అక్కడ జీరో కట్స్‌తో సెన్సార్.. అసలు మూవీ ఎవరు చూడాలంటే?

‘కూలీ’ సినిమాకు ఇండియాలో ‘A’ సర్టిఫికెట్‌.. అక్కడ జీరో కట్స్‌తో సెన్సార్.. అసలు మూవీ ఎవరు చూడాలంటే?

సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కూలీ’ (COOLIE). ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలో మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. యాక్షన్, డ్రామా, వినోదం కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్‌గా నిలవనుందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుని, ప్రమోషన్స్లో వేగం పెంచింది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

ఇండియా & ఓవర్సీస్ సెన్సార్:

కూలీ సినిమాకు మన ఇండియా సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసి రజనీ ఫ్యాన్స్కు షాక్కు గురి చేసింది. ఇన్నేళ్ల రజనీ సినీ కెరీర్లో A సర్టీఫికేట్ పొందిన తొలి చిత్రంగా కూలీ నిలిచింది. అయితే, ఓవర్సీస్ సెన్సార్‌ బోర్డు మాత్రం దీనికి భిన్నమైన రిపోర్ట్‌ను ఇచ్చింది. కూలీ సినిమాకు ఒక్క కట్‌ కూడా సూచించకుండా ‘U/A’ రిపోర్ట్‌ జారీ చేసి ఆశ్చర్యపరిచింది.

అక్కడ మూవీ 2 గంటల 48 నిమిషాల నిడివితో రిలీజ్ కానుంది. అంతేకాదు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో A సర్టిఫికెట్ పొందిన ఫస్ట్ మూవీ కూడా కూలీనే. ఈ సినిమాలో హింస, యాక్షన్ వంటి సన్నివేశాలు ఎక్కువగా ఉన్నందునే ఇండియాలో ‘A’ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు సినీ వర్గాల టాక్. 

అయితే, ఓవర్సీస్ సెన్సార్ బృందం కూడా ఈ సినిమాలో బలమైన హింస ఉందని చెబుతోంది, కానీ వారు మాత్రం ‘A’ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దాంతో కూలీ మూవీ ఇండియా మరియు విదేశాలలో వేర్వేరు సెన్సార్ రేటింగ్‌లను పొందడంతో సినీ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

ఈ క్రమంలో రజనీ ఫ్యాన్స్తో పాటు నెటిజన్లు.. ఇండియన్ సెన్సార్ కోసం U/A రేటింగ్‌తో సినిమా యొక్క మరొక వెర్షన్‌ను ఎడిట్ చేసి, రెండు వెర్షన్‌లను థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్‌ను రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ, అది అసాధ్యం.

ఎందుకంటే, సినిమా కథను బట్టి లోకేష్ ఎక్కడ రాజీపడకుండా తెరకెక్కించగలిగే ఘనుడు. అన్నీ వైపులా కథను అల్లుకోగలిగే దిట్ట. అలాంటిది.. సినిమా సెన్సార్ కోసం కథను మార్చి మరో వెర్షన్ను తీసుకురాలేడు. అలాంటిది ఈ తక్కువ సమయంలో అది అసాధ్యమైన పని. 

A సర్టిఫికేట్:

ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. ఈ సినిమాల్లో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు, పూర్తి నగ్నత్వం, దూషించే భాష అన్నీ ఉంటాయి.

‘U/A’సర్టిఫికేట్:

ఎవరైనా  దీన్ని చూడవచ్చు.. కాకపోతే 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఈ చిత్రాన్ని వారి తల్లిదండ్రులతో కలిసొ లేదా పెద్దల తోడుతో చూడాలని సూచిస్తారు. ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాల్లో హింసాత్మక యాక్షన్ సన్నివేశాలు, కొంతవరకు నగ్నత్వం ఉంటుంది. 

‘కూలీ’ అడ్వాన్స్ బుకింగ్స్:

కూలీ ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ ఓపెన్ అయ్యి.. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తర అమెరికాలో ప్రీమియర్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో  50వేలకి పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని విదేశీ నిర్మాణ సంస్థ వెల్లడించింది.

అంతేకాకుండా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో $1.3మిలియన్లకి పైగా దక్కించుకుని దూసుకెళ్తోంది. సినిమా రిలీజ్ లోపు $2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టేందుకు కూలీ పరుగులు తీయడం ఆసక్తి కలిగిస్తోంది. అయితే, ‘కూలీ’కి పోటీగా వస్తోన్న వార్ 2 మాత్రం అడ్వాన్స్ సేల్స్లో వెనుకంజలో ఉంది.