దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు 

దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు 
  • 1,525 కు చేరిన ఒమిక్రాన్ బాధితులు 
  • బెంగాల్​లో నైట్​ కర్ఫ్యూ.. 
  • స్కూళ్లు కాలేజీలు బంద్​

న్యూఢిల్లీ: కరోనా కేసులు మళ్లీ రోజురోజుకూ పెరుగుతున్నయి. శుక్రవారం కంటే శనివారం 35% కేసు లు పెరగగా, శనివారంకంటే ఆదివారం 21% ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,553 మందికి వైరస్ పాజిటివ్ వచ్చినట్లు ఆదివారం కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. మొత్తం కేసులు 3,48,89,132కు, యాక్టివ్ కేసులు 1,22,801కి పెరిగాయని తెలిపింది. వైరస్​తో మరో 284 మంది చనిపోయారని, మొత్తం డెత్స్ సంఖ్య 4,81,770కి పెరిగిందని పేర్కొంది. డైలీ పాజిటివిటీ 2.55 శాతంగా నమోదైనట్లు తెలిపింది. 
మరో 94 మందికి ఒమిక్రాన్..
దేశంలో మరో 94 మందికి కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సోకింది. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసులు 1,525కు పెరిగాయని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు 560 మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 460, ఢిల్లీలో 351, గుజరాత్​లో 136, తమిళనాడులో 117, కేరళలో 109 మందికి ఒమిక్రాన్ సోకింది. రాజస్థాన్, తెలంగాణ, కర్నాటక, హర్యానాలో 60కిపైనే కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒమిక్రాన్ 23 రాష్ట్రాలకు వ్యాపించింది.  
85 మంది స్టూడెంట్లకు కరోనా..  
ఉత్తరాఖండ్​లోని నైనిటాల్ జిల్లా జవహర్ నవోదయ విద్యాలయలో 85 మంది స్టూడెంట్లకు కరోనా సోకింది. స్కూల్​ను మైక్రో కంటైన్​మెంట్ జోన్​గా ప్రకటించామని, వైరస్ బారిన పడిన స్టూడెంట్లను వివిధ హాస్టల్స్​లో ఐసోలేట్ చేశామని హెల్త్ ఆఫీసర్లు వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన స్టూడెంట్లలో 70% మంది ఫీవర్, దగ్గు, సర్ది వంటి సింప్టమ్స్ తో బాధపడుతున్నారని తెలిపారు. మొదట 11 మంది స్టూడెంట్లకు పాజిటివ్ రావడంతో మొత్తం 488 మంది స్టూడెంట్లకూ ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామని, మరికొందరి రిజల్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. 
బెంగాల్​లో నైట్ కర్ఫ్యూ, స్కూళ్లు బంద్ 
వెస్ట్ బెంగాల్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కొత్త ఆంక్షలు విధించింది. సోమవారం రాత్రి 10 నుంచి ఉదయం 5 మధ్య నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. స్కూల్స్, కాలేజీలు, వర్సిటీలు, జిమ్స్, స్పాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటివి మూసేస్తున్నట్లు వెల్లడించింది. సినిమా టాకీసులు, రెస్టారెంట్లు, బార్లు సగం సీటింగ్ కెపాసిటీతోనే నడపాలని ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు 50% ఉద్యోగులతోనే నిర్వహించాలని స్పష్టంచేసింది. షాపింగ్ మాల్స్​ను ఉదయం 10 నుంచి సాయంత్రం 5 మధ్య తెరవాలని, 50% రద్దీ మాత్రమే ఉండేలా చూడాలని పేర్కొంది. మెట్రో ట్రెయిన్ లనూ 50% సీటింగ్ కెపాసిటీతోనే నడపాలని తెలిపింది. మహారాష్ట్ర, కేరళ తర్వాత బెంగాల్​లోనే కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్రంలో 4,512 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 13,300కు పెరిగాయి. దీంతో ఈ నెల 3 నుంచి 15 వరకూ కొత్త ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
5 నుంచి డాక్టర్లకు వెబినార్లు
దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్​తో సహా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కొవిడ్ కేసుల క్లినికల్ మేనేజ్​మెంట్​పై ఈ నెల 5 నుంచి 19 వరకు వెబినార్​లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీ ఎయిమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వెబినార్​లకు అన్ని రాష్ట్రాలు, జిల్లా లెవెల్​ ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్ల డాక్టర్లు, హెల్త్ ఆఫీసర్లు హాజరయ్యేలా చూడాలని పేర్కొంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, యూనియన్​ టెరిటరీలకు కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషణ్ ​ఆదివారం లేఖ రాశారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టెస్టింగ్, కాంటాక్ట్  ట్రేసింగ్, కంటైన్ మెంట్, వ్యాక్సినేషన్​ వేగం పెంచడంపై అధికారులు దృష్టి పెట్టాలని, ప్రధానంగా మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని రాజేశ్​ భూషణ్​ సూచించారు.