సర్కారు తప్పుడు లెక్కలు: బులెటిన్​లో తక్కువ.. ఆస్పత్రుల్లో ఎక్కువ

సర్కారు తప్పుడు లెక్కలు: బులెటిన్​లో తక్కువ.. ఆస్పత్రుల్లో ఎక్కువ

 సర్కారు తప్పుడు లెక్కలు
దవాఖాన్లలో 28 వేలకు పైగా రోగులు
 రెండ్రోజుల్లో 11,451 మందికే పాజిటివ్​ అంటూ రిపోర్ట్​
 87 మంది మృతి అని వెల్లడి 
 ఇక నుంచి మాపటీలే బులెటిన్​ విడుదల

హైదరాబాద్​, వెలుగు: కరోనాతో జనాలు అల్లాడుతుంటే రాష్ర్ట సర్కార్​ మాత్రం తప్పుడు లెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. హెల్త్​బులెటిన్​లో కేసులు, మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నా.. ఆస్పత్రుల్లో మాత్రం రోజురోజుకూ కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. రెండ్రోజుల్లో 1,550 మంది కరోనా పేషెంట్లు ట్రీట్​మెంట్​ కోసం దవాఖాన్లలో చేరారు. దీంతో మొత్తం ఇన్​పేషెంట్ల సంఖ్య 28 వేలు దాటింది. ఇందులో 8,266 మంది సీరియస్​ కండీషన్​లో ఐసీయూలో ఉంటే, 14,029 మంది ఆక్సిజన్​ సపోర్ట్​పై ఉన్నారు. ఇంకో 5,849 మంది మామూలు లక్షణాలతో నార్మల్​ బెడ్లపై ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. రోజూ కరోనా పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నా.. బులెటిన్​లో మాత్రం తక్కువగా ఉంటుండడం గమనార్హం. 
బులెటిన్​.. ఇక నుంచి మాపటీలే 
రోజూ ఉదయం 8 గంటలకు విడుదల చేస్తున్న కరోనా బులెటిన్​ను ఇక నుంచి సాయంత్రం 6 గంటలకు ఇస్తామని పబ్లిక్​ హెల్త్​ డైరెక్టర్​ డాక్టర్​ శ్రీనివాసరావు తెలిపారు. సీఎం కేసీఆర్​ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులను రోజూ సాయంత్రం ప్రెస్​మీట్​ పెట్టి వెల్లడిస్తామన్నారు. ఈ నిర్ణయంతో శుక్రవారం సాయంత్రం బులెటిన్​ను విడుదల చేశారు. గురువారం, శుక్రవారం కేసులను కలిపి వెల్లడించారు. ఈ రెండ్రోజుల్లో 11,451 కేసులు నమోదైనట్టు బులెటిన్​లో పేర్కొన్నారు. గురువారం 76,047 మందికి టెస్ట్​ చేస్తే 5,892 మందికి, శుక్రవారం 65,375 టెస్టులకుగానూ 5,559 మందికి మాత్రమే పాజిటివ్​ వచ్చినట్టు ప్రకటించారు. మొత్తంగా ఈ రెండు రోజుల్లో గ్రేటర్​ హైదరాబాద్​లో 2,088, జిల్లాల్లో 9,363 కేసులు వచ్చినట్టు చూపించారు. వీటితో కలిపి రాష్ర్టంలో కరోనా బాధితుల సంఖ్య 4,87,199కి పెరిగింది. అందులో 4,13,225 మంది కోలుకున్నారన్నారు. ప్రస్తుతం 71,308 మంది కరోనా ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నట్టు చెప్పారు. కరోనాతో గురువారం 46 మంది, శుక్రవారం 41  మంది చనిపోయారని, మొత్తం మరణాలు 2,666కు పెరిగాయని బులెటిన్​లో వెల్లడించారు.
గాంధీ డాక్టర్లు మంచిగ పనిచేస్తున్నరు
    కరోనా వార్డులు, ఆక్సిజన్​ ప్లాంటును పరిశీలించిన సీఎస్​ పద్మారావునగర్​, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో కరోనా పేషెంట్లకు డాక్టర్లు మంచి ట్రీట్​మెంట్​ అందిస్తున్నారని, వారి సేవలు బాగున్నాయని సీఎస్​ సోమేశ్​ కుమార్​ కొనియాడారు. శుక్రవారం ఆయన గాంధీ ఆస్పత్రిలో కరోనా ట్రీట్​మెంట్​ తీరును పరిశీలించారు. మెడికల్​ కాలేజ్​ లైబ్రరీ బిల్డింగ్​లో పేషెంట్ల కోసం ఏర్పాటు చేసిన 160 బెడ్ల కొత్త వార్డు, రోజూ 4 టన్నుల ఆక్సిజన్​ను తయారు చేసే ఆక్సిజన్​ ప్లాంట్, ఓపీ బ్లాక్​లో ఆక్సిజన్​ పైప్​లైన్​ పనులను ​ పరిశీలించారు. కొత్త ఆక్సిజన్​ ప్లాంట్​తో రోజూ 400 మంది పేషెంట్లకు ఆక్సిజన్​ను అందించొచ్చని సీఎస్​కు గాంధీ సూపరింటెండెంట్​ రాజారావు వివరించారు. ఓపీ బ్లాక్​లో ఏర్పాటు చేస్తున్న పైప్​లైన్​ ద్వారా కరోనా పేషెంట్లకు ఆక్సిజన్​ను అందిస్తామని చెప్పారు.