- క్వింటాల్ పత్తికి రూ.9,300 పలుకుతున్న ధర
- పంట తగ్గడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు
- పత్తి ధర రూ.15 వేలకు పెంచాలని రైతుల డిమాండ్..
- రూ.11 వేలకు చేరే అవకాశం ఉందంటున్న మార్కెట్ వర్గాలు
వరంగల్, వెలుగు: రాష్ట్రంలో పత్తి రైతులకు ఎల్‌నినో ఎఫెక్ట్‌తో ఈ ఏడాది కష్టాలు తప్పడం లేదు. గతేడాదితో పోలిస్తే మార్కెట్లో పత్తి ధరలు క్వింటాల్‌కు రూ.2 నుంచి రూ. 3వేల వరకు పెరిగినా దిగుబడి గణనీయంగా తగ్గడంతో రైతులకు నిరాశే మిగులుతోంది. ఏటా వర్షాధారంగా పత్తి సాగు చేసే రైతులు దిగుబడి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక సాగుకు దూరమయ్యారు. వర్షాలను నమ్ముకుని పంట వేసిన రైతులకూ ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర నష్టం వాటిల్లింది.
గ్రౌండ్ వాటర్ పడిపోయి బోర్లు పనిచేయక పంటలు ఎండిపోయాయి. ఫలితంగా గతంతో పోలిస్తే ఈసారి 3 నుంచి 4 క్వింటాళ్లకే పరిమితమవుతోంది. మార్కెట్లో ధరలు పెరిగినా దిగుబడి లేక పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో నాణ్యమైన పత్తికి డిమాండ్ పెరుగుతుండగా, ధరలు మరింత పెరుగుతాయని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
70 శాతం తగ్గిన పత్తి సాగు.. దిగుబడి
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పత్తి సాగు గణనీయంగా తగ్గింది. 2025-– 26 సీజన్లో 13,80,331 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఈ ఏడాది సీజన్లో కేవలం 5,92,472 ఎకరాల్లోనే సాగు చేపట్టినట్లు ఆఫీసర్ల లెక్కలు చెబుతున్నాయి. దీంతో గతేడాదితో పోలిస్తే సాగు విస్తీర్ణం సుమారు 70 శాతం తగ్గింది. వర్షాభావంతో చెరువులు, కుంటలు నిండకపోవడం, గ్రౌండ్ వాటర్ పాతాళానికి పడిపోవడంతో బోర్ల ద్వారా పంటను కాపాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది.
కొద్దిపాటి నీటి వసతి ఉన్న ప్రాంతాల్లోనూ గతంలో మాదిరిగా 12 గంటల విద్యుత్ అందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిస్థితులతో పంట దిగుబడులు భారీగా పడిపోయాయి. గతంలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేదని, ఈసారి మాత్రం 3 నుంచి 4 క్వింటాళ్లకే పరిమితమైందని రైతులు చెబుతున్నారు.
మద్దతు ధర రూ.8,667.. మార్కెట్లో రూ.9,300
ఈ ఏడాది పత్తికి మార్కెట్లో మంచి ధరలు పలుకుతున్నాయి. గతేడాది ఇదే సీజన్లో వరంగల్ ఏనుమాముల మార్కెట్లో క్వింటాల్ పత్తి ధర రూ.7,300 నుంచి రూ.7,600 మధ్య పలికింది. ఈ సీజన్లో ఖమ్మం వంటి మార్కెట్లలో క్వింటాల్‌కు రూ.9,300 వరకు ధర లభిస్తుండగా, ఏనుమాముల మార్కెట్లో రూ.9,060 పలుకుతోంది.
గతేడాది పత్తికి సీసీఐ మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,110 కాగా, ఈసారి రూ.8,667కు పెరిగింది. అంటే రూ.557 పెంచినట్లయింది. అయితే ప్రస్తుత మార్కెట్ ధరలు మద్దతు ధరను మించి ఉండటంతో రైతులకు కొంత ఊరట లభిస్తున్నట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే మార్కెట్ ధర క్వింటాల్‌కు దాదాపు రూ.2 వేల వరకు పెరిగినా దిగుబడి తగ్గడంతో రైతులకు ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు.
ధర పెంపుతో పత్తి రైతులు ఆశలు..
పత్తి సాగుకు విత్తనాలు, ఎరువులు, కూలీలు, పంట కోత, రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి ఎకరాకు రూ.40 వేలకు పైగా పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. క్వింటాల్‌కు సగటున రూ.7,500 ధర లభించినా, ఒక్కో ఎకరం ద్వార సుమారు రూ.80 వేల వరకు ఆదాయం వచ్చేది.
ఈ సరి ఎల్ నినో ప్రభావంతో ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుండటంతో, క్వింటాల్‌కు రూ.9,300 ధర లభించినా సుమారు రూ.30 వేల వరకు మాత్రమే రానున్నయి. దీంతో ఈ సీజన్లో పత్తి రైతులకు పెట్టుబడి కూడ చేతికి వచ్చే పరిస్థితులు లేవు. ఈ క్రమంలో పంట నష్టాల నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం పత్తి ధరను మరింత పెంచాలని వారు కోరుతున్నారు.
రూ.11 వేలకు పెరిగే అవకాశం..
గతేడాదితో పోలిస్తే ఈసారి సీజన్ ప్రారంభంలోనే పత్తి ధర క్వింటాల్‌కు దాదాపు రూ.2 వేల వరకు పెరిగింది. అయితే దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో పత్తి సాగు 60 నుంచి 70 శాతం వరకు తగ్గింది. ప్రస్తుతం ఏనుమాముల మార్కెట్‌కు రోజుకు సగటున 3 వేల బస్తాల పత్తి వస్తోంది.
మార్కెట్లో మంచి ధరలు లభిస్తున్నందున రైతులు దళారులకు కాకుండా మార్కెట్‌కు పత్తిని తీసుకురావాలి. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.9,060 ధర పలుకుతుండగా, పత్తి నాణ్యతను బట్టి రూ.11 వేల వరకు చేరే అవకాశం ఉన్నాయి.
- పులి ప్రియాంక, ఏనుమాముల మార్కెట్ చైర్పర్సన్
ఎకరాకు 3 క్వింటాళ్ల పత్తి ఎళ్లలే..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక ఈసారి పత్తి సాగు చేసి మునిగినం. పోయినేడాది ఇదే భూమిలో ఎకరాకు కనీసం 10 క్వింటాళ్ల పత్తి ఎళ్లింది. ఈసారి వానల్లేక మూడు క్వింటాళ్లకు అటూఇటూగానే పంట చేతికొచ్చింది. మార్కెట్లో ధరలు పెరిగినా పెట్టుబడి వెళ్లని పంట లేనప్పుడు ఎవరికి లాభం.
-గడ్డం రమేశ్, గీసుగొండ, వరంగల్
క్వింటాల్ ధర రూ.15 వేలకు పెంచాలి
గతేడాదితో పోలిస్తే ఈసారి పత్తి ధరలు పెరిగాయని ఆఫీసర్లు చెబుతున్నారు. గతంలో ఎకరాకు రూ.80 వేల పంట తీసిన కాడ ఇప్పుడు రూ.30 వేలే చేతికొస్తున్నయ్. ఈ లెక్కన ఈ సారి ఎకరం మీద రూ.50 వేలు నష్టపోతున్నం. పండుగ పూట నవ్వులేకుండ పోయింది. వానల్లేక పత్తిపంట దిగుబడి తగ్గింది కాబట్టి క్వింటాల్ పత్తికి రూ.15 వేల ధర ఇస్తేనే పెట్టుబడి అప్పుల నుంచి కొంతైనా బయటపడ్తం.
-బోజ్యా నాయక్, వర్ధన్నపేట
