ప్రభుత్వమే వడ్లను మిల్లర్లకు అప్పగించాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

ప్రభుత్వమే వడ్లను మిల్లర్లకు అప్పగించాలి : మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్ సిటీ, వెలుగు: రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొని మిల్లర్లకు అప్పగించాలని సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం సిటీలోని బద్దం ఎల్లారెడ్డిభవన్‌‌లో సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొన్నప్పటికీ  గతంలో మాదిరిగా రైస్ మిల్లులకు రైతులే తీసుకువెళ్లి వాటిని అప్పగించే విధానంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 

తిమ్మాపూర్, వెలుగు: కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలవ్యాప్తంగా సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయనీ, వరద కాలువ ద్వారా నీరందించి రైతులను ఆదుకోవాలని సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్​రెడ్డి ఎస్సారెస్పీ డిప్యూటీ సీఈ జగన్​కు బుధవారం వినతిపత్రం అందించారు. చిగురుమామిడి మండలం ఇందుర్తి, ముదిమాణిక్యం, సీతారాంపూర్​, ముల్కనూర్​, పీచుపల్లె, రేకొండ, బొమ్మనపల్లె గ్రామాల్లోని పంటలకు కొంతమేర నీరందుతోందని, మిగిలిన గ్రామాలకు వరద కాలువలు పూర్తిగా నిర్మించకపోవడంతో నీరందడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయా కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బోయిని తిరుపతి, లక్ష్మారెడ్డి, సమ్మయ్య, తిరుపతి, రాజు పాల్గొన్నారు.