
- సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కామారెడ్డిటౌన్, వెలుగు : అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుందని, ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమాలు చేస్తామని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం సీపీఐ కామారెడ్డి జిల్లా 3వ మహాసభలు జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌజ్ నుంచి మున్నురుకాపు సంఘం వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ ఆ పార్టీ సీనియర్ నాయకులు వి.ఎల్.నర్సింహారెడ్డి జెండా ఆవిష్కరించారు.
అనంతరం కూనంనేని మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకలను మావోయిష్టులు అని, అర్బన్ నక్సలైట్లు అని ముద్ర వేసి చంపే హక్కు ఎవరు ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వం 11 ఏండ్లుగా ఇచ్చినా హామీలను నేరవేర్చలేదన్నారు. దేశాన్ని దోచుకొని విదేశాలకు పారిపోయిన వారిని ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. రాష్ర్ట ప్రభుత్వం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, ఫించన్లు, రైతు బీమా వంటి సమస్యలను పరిష్కరించాలన్నారు. జాతీయ నాయకురాలు పశ్యపద్మ, సీనియర్ నాయకులు వి.ఎల్.నర్సింహారెడ్డి, కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి ఎల్. దశరథ్, నాయకులు బాల్‌రాజు, రాములు, దేవయ్య, రాజిరెడ్డి, గంగాధర్, విమల తదితరులు పాల్గొన్నారు.