
తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో ఉద్దేశపూర్వకంగానే అగ్నిప్రమాదాన్ని సృష్టించినట్లు ఉందని, కావాలనే ప్రభుత్వ ఫైల్స్ తగలబెట్టారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అనుమానం వ్యక్తం చేశారు. 2023, డిసెంబర్ 3వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో హిమాయత్ నగర్ లోని తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని ఫైల్స్, ఫర్నిచర్ , కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి.
కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బందికి హుటాహుటినా ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కార్యాలయం కింద ఉన్న రెండు ఇన్నోవా కార్లపై అగ్ని కీలలు పడటంతో అవి కూడా కాలి బూడిదయ్యాయి. ఈ క్రమంలో పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రమాద స్థలాన్ని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించి , పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకంగా చేసినట్లు ఉంది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లోని కీలక ఫైల్స్ ఈ ప్రమాదంలో అగ్నికి ఆహుతయ్యాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుందనే కారణం వల్లే ఈ ప్రమాదాన్ని సృష్రించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి బాగోతం బట్టబయలు కాకుండా కుట్ర చేస్తున్నారు. ఇటీవల పర్యాటక శాఖ ఎండీ మనోహర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఊడిగం చేయడం వల్లే ఎన్నికల కమిషన్ ఆయనని సస్పెండ్ చేసింది. ఈ ప్రమాదంలో ఆయన ప్రమేయంపై విచారణ చేయాలి. ఈ ఘటనపై హైలెవల్ ఎంక్వయిరీ చేయించాలి... అప్పుడే వాస్తవాలు బయటకి వస్తాయి" అని నారాయణ డిమాండ్ చేశారు.