నిద్ర మాత్రలిచ్చినా బతికాడని.. భర్తను కరెంట్ షాక్‌తో చంపిన భార్య.. కథ బయటపెట్టిన ఇన్‌స్టాగ్రామ్!

నిద్ర మాత్రలిచ్చినా బతికాడని.. భర్తను కరెంట్ షాక్‌తో చంపిన భార్య.. కథ బయటపెట్టిన ఇన్‌స్టాగ్రామ్!

సమాజంలో సంబంధాలు, నమ్మకాలు పలచబడిపోతున్న తీరుకు అద్దం పట్టే సంఘటనలు రోజురోజుకూ పెరిగిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం భర్తలను చంపుతున్న భార్యలు, తల్లిదండ్రులను చంపేస్తున్న పిల్లల సంఖ్య సమాజంలో పెరిగిపోతోంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి దేశ రాజధాని ఢిల్లీలోనూ చోటుచేసుకుంది. 

కరణ్ దేవ్ అనే 35 ఏళ్ల వ్యక్తిని అతని భార్య సుష్మిత మర్డర్ చేసింది. అయితే దీనికి కారణం ఆమెకు బావమరిదితో ఉన్న వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉండటంతో హత్య చేసింది. మెుదటగా భర్త తినే ఆహారంలో వారు ప్లాన్ ప్రకారం 15 నిద్రమాత్రలు కలిపారు. అయితే ఆ ఆహారం తిన్న తర్వాత కరణ్ మత్తులోకి జారుకున్నాడు. నిద్రమాత్రలు ఇచ్చినప్పటికీ భర్త బ్రతికే ఉండటంతో నిందితులు సుష్మిత, రాహుల్ అతడిని ఎలాగైనా చంపేందుకు కరెంట్ షాక్ ఇచ్చారు. 

కరణ్ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కి గురయ్యాడంటూ అతడిని తమకు దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించినట్లు ఆసుపత్రి సిబ్బంది నిర్థారించారు. చూడటానికి ఇదంతా నిజంలాగానే కనిపించటంతో కరణ్ బంధువులు కూడా పోస్టుమార్టం అక్కర్లేదని చెప్పారు. అయితే ఢిల్లీ పోలీసులు మాత్రం చనిపోయిన వ్యక్తి వయస్సు, కారణాలను పరిగణలోకి తీసుకుని పోస్టుమార్టం చేయాల్సిందేనని ఆదేశించారు. 

అయితే పోస్టుమార్టానికి నిందితులు రాహుల్, కరణ్ భార్య సుష్మిత మాత్రం అంగీకరించలేదు. అయితే ఘటన జరిగిన రెండు రోజులకు కరణ్ సోదరుడు పోలీసులకు సుష్మిత, రాహుల్ కలిసి అతడిని చంపినట్లు అనుమానం ఉందని పోలీసులను ఆశ్రయించాడు. దీనికి వారిద్దరి మధ్య జరిగిన ఇన్ స్ట్రాగ్రామ్ చాటింగ్ సాక్ష్యంగా పోలీసులకు అందించాడు. అందులో వారు మర్డర్ ప్లాన్ గురించి చేసిన చాటింగ్ మెుత్తం ఉంది. నిద్రమాత్రలు మింగితే ఎంతసేపటికి చనిపోతారనే వివరాలు తెలుసుకునేందుకు నిందితులు గూగుల్ చేసినట్లు కూడా తేలింది. 

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సమాజంలో ఈ తరహా నేరాలు, ముఖ్యంగా కుటుంబ సంబంధాల్లో జరుగుతున్న హత్యలు, సామాజిక నైతికత విలువలను ప్రజలు కోల్పోవటం నేరాలకు కారణంగా మారుతోంది. భర్త అడ్డు తొలగితే తమ అక్రమ సంబంధం కొనసాగించవచ్చని లేదా ఆస్తిని పొందవచ్చని భావించే భార్యలు ఇలాంటి దారుణమైన చర్యలకు పాల్పడుతున్న ఘటనలు దేశంలోని అనేక ప్రాంతాల్లో తరచుగా వార్తల్లో కనిపిస్తున్నాయి. అయితే శాస్త్రీయ ఆధారాలు నిందితులను పట్టిస్తున్నాయి.