పాపన్న కోటకు పగుళ్లు

పాపన్న కోటకు పగుళ్లు

రఘునాథపల్లి, వెలుగు: బహుజన పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న కట్టించిన కోట బురుజుకు పగుళ్లు రావడంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో సర్దార్ పాపన్న నిర్మించిన కోటను సర్కారు టూరిజం స్పాట్​గా గుర్తించింది. ఖిలాషాపూర్ కోట రిపేర్లకు 2017 లో రూ. 4.5 కోట్లు మంజూరు చేసింది. కోట డెవలప్​మెంట్​పనులను పురావస్తు శాఖ అధికారులకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అప్పజెప్పారు. పనులు కొనసాగుతుండగానే వానలకు గత సంవత్సరం కోటలో కొంతభాగం కూలి పక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఆ తర్వాత కూడా తూతూ మంత్రంగా కోట పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కోటకు పగుళ్లు రావడంతో పక్కన ఉన్న ఇళ్లలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నాణ్యత లోపంతో పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు రికవరీ చేసి పురావస్తు శాఖతో కోటకు పూర్వవైభవం తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.