యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి

యూరియా కొరత సృష్టిస్తే కఠిన చర్యలు : కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి
  • కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి  

నిజామాబాద్‌, వెలుగు : యాసంగి సీజన్‌కు సరిపడా యూరియా సరఫరా చేస్తామని కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి తెలిపారు. ఎవరైనా కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే, సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం నిజామాబాద్‌ మండలంలోని ఖానాపూర్‌ సింగిల్‌ విండో సొసైటీలో యూరియా స్టాక్‌, రికార్డులను కలెక్టర్​పరిశీలించి మాట్లాడారు. రెండు దఫాలుగా సరిపడా యూరియా అందిస్తామని, ఎక్కడా క్యూలో నిలబడే పరిస్థితి రాకుండా ప్లాన్‌ ప్రకారం పంపిణీ చేయాలని ఆదేశించారు. 

 స్టాక్‌ పూర్తికావడానికి ముందే కొత్త ఇండెంట్‌ పెట్టాలని, ప్రతి రోజు జరిగిన అమ్మకాలు, స్టాక్‌ వివరాలను తనకు నివేదించాలన్నారు. మార్క్​ఫెడ్‌, కోఆపరేటివ్‌ ఆఫీసర్లు సమన్వయంతో పని చేసి ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఏవో వీరాస్వామి, కోఆపరేటివ్‌ ఆఫీసర్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.  నందిపేట మండలంలోని తహసీల్దార్‌ ఆఫీస్‌లో భూభారతి అప్లికేషన్ల ప్రగతిని పరిశీలించి, సాదాబైనామాలను పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం రోడ్‌ సేఫ్టీ కమిటీ మీటింగ్‌ను నిర్వహించారు.

భూభారతి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి  

నందిపేట : భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం నందిపేట తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో దరఖాస్తులను తిరస్కరించవద్దని, ఒకవేళ దరఖాస్తులు తిరస్కరణకు గురైతే తగిన కారణాలను స్పష్టంగా తెలుపాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ భూ యాజమాన్య హక్కులు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్‌, సిబ్బంది పాల్గొన్నారు.