తొగుట , (దౌల్తాబాద్) వెలుగు: మంత్రి హరీశ్ రావు దుబ్బాకపై కపట ప్రేమ చూపిస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం దౌల్తాబాద్ మండలంలో మీడియాతో మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోకుండా మంత్రి హరీశ్ రావు వారి పేరిట రాజకీయం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. మంత్రి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని, రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే పంట నష్టపరిహారానికి సంబంధించిన జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం చేయాలని అడిగితే కేంద్రం నుంచి డబ్బులు తీసుకురావాలని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. కేంద్రం నేరుగా దుబ్బాకకు నిధులు ఇవ్వదని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిధులు ఇస్తుందనే విషయం కూడా తెలియదా.. ? అని ప్రశ్నించారు. కేంద్ర విపత్తు సహాయ నిధుల ద్వారా రాష్ట్రానికి వచ్చిన డబ్బులతో పరిహారం చెల్లించాలని కోరారు. అనంతరం దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియల్‌లో పర్యటించి.. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
త్వరలోనే మొండిచింత నుంచి ఇందుప్రీయల్ వరకు బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. శాలివాహన సంఘం భవనానికి భూమి పూజ చేశారు. గ్రామంలోని అంబేద్కర్ సంఘం సభ్యులకు రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు. బీజేపీ గ్రామ అధ్యక్షుడు పోతరాజు కిషన్, ఎంపీటీసీ మల్లేశం, నేతలు భూపాల్, రామస్వామి గౌడ్, చంటి, శ్రీనివాస్ పాల్గొన్నారు.