పోలవరం-నల్లమలసాగర్ను అజెండాలో పెట్టొద్దు!..పెడ్తే చర్చలకు వచ్చేది లేదు

పోలవరం-నల్లమలసాగర్ను అజెండాలో  పెట్టొద్దు!..పెడ్తే చర్చలకు వచ్చేది లేదు
  • ఒకవేళ పెడ్తే చర్చలకు వచ్చేది లేదు
  • సీడబ్ల్యూసీ కమిటీ మీటింగ్​లో తేల్చిచెప్పిన తెలంగాణ
  • ట్రిబ్యునల్​ తేల్చేదాకా నీటి వాటాల్లో సగం ఇవ్వాల్సిందేనని పట్టు 
  • పోలవరం–నల్లమలసాగర్​ ప్రతిపాదనలేవీ రాలేదన్న సీడబ్ల్యూసీ
  • కేవలం బనకచర్ల పీఎఫ్​ఆర్​ పరిశీలనలో ఉందని వెల్లడి
  • రెండు వేర్వేరు ప్రాజెక్టులన్న ఏపీ.. ఫేజ్​1, ఫేజ్​2ల్లో చేపడతామని క్లారిటీ
  • త్వరలోనే పోలవరం–నల్లమలసాగర్​ పీఎఫ్​ఆర్​నూ సమర్పిస్తామని వెల్లడి
  • సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకొచ్చే నష్టమేంటన్న ఏపీ

హైదరాబాద్​/న్యూఢిల్లీ, వెలుగు: ఏపీ అక్రమంగా చేపడుతున్న పోలవరం--– నల్లమలసాగర్​ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలూ చేపట్టేందుకు వీల్లేదని తేల్చి చెప్పింది. భవిష్యత్​లోనూ అజెండాలో ఆ అంశాన్ని చేర్చరాదని, ఒకవేళ ఆ అంశాన్ని     అజెండాలో పెడితే చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టింది. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాలపై సెంట్రల్​ వాటర్​ కమిషన్ (సీడబ్ల్యూసీ) చైర్మన్​ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ మీటింగ్​ శుక్రవారం ఢిల్లీలో జరిగింది. రెండు రాష్ట్రాల సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. ఏపీ.. పోలవరం– నల్లమలసాగర్​ ప్రాజెక్టు టాపిక్​ తేవడంతో ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా ఫైర్​ అయ్యారు. ఆ ప్రాజెక్టే అక్రమమని, వరద జలాలపై ప్రాజెక్టు  కట్టి బేసిన్​కాని బేసిన్​కు నీళ్లెలా తరలిస్తారని ప్రశ్నించారు. దీనిపై చర్చలు అనవసరమని ఏపీకి తేల్చి చెప్పారు. అయితే, తమకు పోలవరం– బనకచర్ల పీఎఫ్​ఆర్​ మాత్రమే వచ్చిందని, నల్లమలసాగర్​ పీఎఫ్​ఆర్​ రాలేదని సీడబ్ల్యూసీ చెప్పినట్టు తెలిసింది. పోలవరం–బనకచర్ల పీఎఫ్​ఆర్​ కేవలం పరిశీలనలోనే ఉందని, ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పినట్టు సమాచారం. ఏపీ పోలవరం–నల్లమలసాగర్​ కడుతున్నదని సెక్రటరీ రాహుల్​ బొజ్జా సీడబ్ల్యూసీకి చెప్పారని సమాచారం. 

ఈ మధ్యలోనే కల్పించుకున్న ఏపీ.. అవి రెండు వేర్వేరు ప్రాజెక్టులని, పోలవరం– బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్​ ఫస్ట్​ ఫేజ్​ అని, రెండో ఫేజ్​లో పోలవరం–నల్లమలసాగర్​ను చేపడతామని చెప్పినట్టు తెలిసింది. దానికి సంబంధించిన పీఎఫ్​ఆర్ (ప్రి ఫీజిబిలిటీ రిపోర్ట్​)ను త్వరలోనే సమర్పిస్తామని వెల్లడించినట్టు సమాచారం. సముద్రంలో కలిసే నీళ్లను వాడుకుంటే తెలంగాణకు వచ్చే నష్టమేంటని ఏపీ వితండవాదనకు దిగినట్టు తెలిసింది. అయితే, కృష్ణాలోనూ వరద జలాలున్నాయని, ఆ నీళ్లన్నింటినీ తాము కూడా వాడేసుకుంటామని బొజ్జా గట్టిగా కౌంటర్​ ఇచ్చారని సమాచారం. అసలు గోదావరిలో వరద జలాలు ఎక్కడున్నాయని ప్రశ్నించినట్టు తెలిసింది. జీ1, జీ2, జీ3, జీ5 బేసిన్లలో మిగులు జలాలే లేవని, అలాంటప్పుడు వరద జలాలు ఎక్కడి నుంచి వస్తాయని నిలదీసినట్టు సమాచారం. పోలవరం బనకచర్ల, పోలవరం నల్లమలసాగర్​ పీఎఫ్​ఆర్​ను పరిశీలనలోకి తీసుకోవద్దని తేల్చి చెప్పారని తెలిసింది. ప్రస్తుత మీటింగ్​ కేవలం ఎజెండా తయారు చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని, ఇప్పుడు ఎలాంటి చర్చలు చేయవద్దని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఎజెండా ఐటెమ్స్​ ఇచ్చేందుకు రెండు రాష్ట్రా లకు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) చైర్మన్​ వారం టైమ్​ ఇచ్చారు. ఈ వారంలో రెండు రాష్ట్రాలు తమ తమ ఎజెండాలు మార్చుకోవాలని, దానిపై 15 రోజుల్లోగా రెండు రాష్ట్రాలు అభిప్రాయాలు చెప్పాలని సూచించారు. వాటి ఆధారంగా ఒక ఎజెండాను తయారు చేస్తామని, దానికి అనుగుణంగా చర్చలు చేద్దామని చెప్పారు. 

సగం వాటా ఇవ్వాల్సిందే..

రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పక్కాగా తేల్చా ల్సిందేనని తెలంగాణ అధికారులు కేంద్రానికి తేల్చి చెప్పారు. ట్రిబ్యునల్​ తీర్పు వచ్చేదాకా బచావత్​ కేటాయింపుల్లో సగం వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని, అది ఈ ఏడాది నుంచే అమలు కావాలని స్పష్టం చేశారు. కృష్ణా డెఫిసిట్​ బేసిన్​ అని, అక్రమ నీటి మళ్లింపులను ఆపాలని కోరారు. అంతేగాకుండా విభజన తర్వాత ఏపీ పలు ప్రాజెక్టులను చేపట్టిందని, వాటికి కనీసం డీపీఆర్​లు కూడా లేవని, వాటిపైనా చర్చించాలని సూచించారు. తెలంగాణ ఏర్పడడానికి ముందే స్టార్ట్​ చేసిన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని, పాలమూరు వంటి ప్రాజెక్టులకు తొందరగా అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు. అయితే, బచావత్​ అవార్డు విషయంలో ఏపీ కొర్రీలు పెట్టినట్టు తెలిసింది. అందుకు మన అధికారులు కూడా అంతే దీటుగా బదులిచ్చినట్టు తెలిసింది. తమ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతమ్మసాగర్​ వంటి ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినప్పుడు లేని వివాదం.. ఇప్పుడు పోలవరం–నల్లమలసాగర్​ విషయంలోనే ఎందుకని ఏపీ అధికారులు లేవనెత్తినట్టు సమాచారం. కాగా, సమావేశానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు పెట్టని ఏపీ.. తమ ఆలోచనలను పీపీటీ రూపంలో కేంద్రానికి విన్నవించింది. ఇటు రెండు రాష్ట్రాల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, నీటి కేటాయింపులు, 12 ఏండ్లలో రెండు రాష్ట్రాల వినియోగాలపై సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డులు కూడా పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చినట్టు తెలిసింది.