బస్తీల్లో అర్ధరాత్రి మీటింగ్​లు.. రౌడీషీటర్ల బెదరింపులు

బస్తీల్లో అర్ధరాత్రి మీటింగ్​లు.. రౌడీషీటర్ల  బెదరింపులు
  •     బస్తీల్లో అర్ధరాత్రి మీటింగ్​లు
  •     ప్రత్యుర్థుల క్యాడర్​కు హెచ్చరికలు 
  •     అడ్వాంటేజ్​గా మారిన పోలీసుల బిజీ షెడ్యూల్ 
  •     ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్న బాధితులు 
  •     డయల్ 100కు కాల్​ చేయాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌,వెలుగు: అసెంబ్లీ ఎన్నికల వేళ సిటీలో రౌడీషీటర్లు తమ మార్క్‌ చూపుతున్నారు. పోలీసులు ఎంతా నిఘా పెట్టినా చిక్కడం లేదు. ఉదయమంతా ఇళ్లలోనే ఉంటూ రాత్రిపూట రోడ్డెక్కుతున్నారు. తమ అభ్యర్థులకు సైలెంట్​గా ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థి అభ్యర్థుల క్యాడర్​కు వార్నింగ్​లు ఇస్తున్నారు. ఇలాంటి ఘటనలకు గురైన బాధితులు సీపీ, డీసీపీలను ఆశ్రయి స్తున్నారు. అయితే.. ఇప్పటికే బైండోవర్స్‌ ఉండడంతో సంబంధిత రౌడీషీటర్లకు కౌన్సెలింగ్స్ ఇస్తున్నారు. వారి కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులకు పోలీసులు సూచిస్తున్నారు.

కౌన్సెలింగ్‌, లొకేషన్స్​తో నిఘా  

ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గ్రేటర్‌‌లోని మూడు కమిషనరేట్ల సీపీలు రౌడీషీటర్లను బైండో వర్స్ చేసిన సంగతి తెలిసిందే. ఎలాంటి అవాంచనీయ ఘటనలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. రౌడీషీటర్స్ ఉండే ప్రాంతాలకు చెందిన సెక్టార్ ఎస్‌ఐ,స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులతో నిఘా పెడుతున్నారు. రాత్రిపూట వారి కదలికలపై సమాచారం తీసుకుంటున్నారు. దీంతో పాటు ఉదయం, సాయంత్రం రౌడీషీటర్లు సంచరించే ఏరియాల లొకేషన్స్‌ షేర్ చేయాలని సూచించారు. మొదట్లో ఈ ప్రక్రియ బాగానే కొనసాగింది. పోలీసులు ఎలక్షన్ బందోబస్తులో బిజీ కావడంతో గ్రౌండ్ లెవల్‌లో నిఘా తగ్గింది.

సపోర్ట్​ చేసే వారికి అండగా..

పోలీసుల బిజీ షెడ్యూల్‌నే రౌడీషీటర్లకు అడ్వాంటేజ్​గా మారింది. తమ సెగ్మెంట్లలో  బరిలో నిలిచిన అభ్యర్థులను కలిసి ఓకే చెబితే వెంటనే రంగంలోకి దిగి అర్ధరాత్రి వేళ తమ అనుచరులతో కలిసి స్థానికంగా తిరుగుతున్నారు. తాము మద్దతుగా నిలిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారాలు చేసే వారిని బెదిరిస్తున్నారు. ప్రత్యక్షంగా కాకుండా ఇతరులతో పరోక్షంగా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి  రౌడీషీటర్లపై నిఘా పెట్టామని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే స్థానిక పోలీసులకు లేదా డయల్100కు కాల్ చేయాలంటున్నారు.